నియమావళిని చ్చితంగా పాటించాలి

May 1,2024 23:55

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు:
రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలని గుంటూరు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి స్టాండింగ్‌ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. అధ్యక్షత వహించిన జిల్లా ఎన్నికలాధికారి మాట్లాడుతూ ప్రార్థనాలయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదన్నారు. ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను అరికట్టడానికి ఫ్లైయింగ్‌ స్వ్వాడ్‌లు, ఎఫ్‌ఎస్టీ బృందాలు, ఎన్ఫోర్స్మేంట్‌ ఏజెన్సీలు, నిరంతరం నిఘాతో తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు. కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సీవిజిల్‌ యాప్‌ ద్వారా వచ్చిన 286 ఫిర్యాదుల్లో 279 (98 శాతం) నిర్దేశించిన 100 నిమిషాల వ్యవధిలోనే పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 60 కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైని) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఎంసీసీ నోడల్‌ అధికారి వీరాచారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️