తొలి ముఖ్యమంత్రిని అందించిన ఎస్‌.కోట

Apr 16,2024 21:55

ప్రజాశక్తి-శృంగవరపుకోట : శృంగవరపుకోట నియోజకవర్గం పేరు వినగానే విశాఖ -అరకు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న సంగతి ఇట్టే గుర్తుకొస్తుంది, ఈ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులును తొలి ముఖ్యమంత్రిగా అందించిన ఘనతను సొంతం చేసుకుంది. మొట్టమొదటి ఎమ్మెల్యే ప్రజా సోషలిస్ట్‌ పార్టీకి చెందిన చాగంటి సోమయాజులు అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులను ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలతో ఏకీభవించి సోమయాజులు తన పదవిని త్యాగం చేశారు. శృంగవరపుకో నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఎస్‌.కోట, లక్కవరపుకోట, వేపాడ, జామి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆంధ్రకేసరిగా ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఒకసారి ఉప ఎన్నికల్లో ఎన్నికై ప్రాతినిద్యం వహించారు. ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరగ్గా, సోషలిస్టు పార్టీ ఒకసారి, ప్రజాసోషలిస్టు పార్టీ రెండుసార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు గెలుపొందగా, వైసిపి ఒకసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం 1955లో శృంగవరపుకోట నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. ద్విశాసన సభగా ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఒకరు గిరిజనులకు, bసy గిరిజనేత రులకు ప్రాతినిద్యం వహించారు. ఎస్‌టి స్థానానికి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నుంచి గుజ్జల రామునాయుడు, కాంగ్రెస్‌ నుంచి కె. వీరన్న పోటీపడ్డారు ఈ ఎన్నికల్లో గుజ్జుల రామునాయుడుకు గిరిజనులు పట్టం కట్టారు, అలాగే గిరిజనేతర స్థానానికి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నుంచి చాగంటి వెంకట సోమయాజులు స్వతంత్ర అభ్యర్థిగా గొర్రిపాటి బుచ్చి అప్పారావు పోటీ పడగా ఓటర్లు సోమయాజులకు విజయాన్ని అందించారు. గెలుపొందిన వీరిద్దరూ ఒకేసారి ఒకే స్థానానికి 1955 నుండి 1960 సంవత్సరం వరకు ఎమ్మెల్యేలుగా పని చేయడం గమనార్హం. ఇక్కడ ప్రజలు ప్రతిసారి విలక్షణమైన తీర్పునే అందిస్తూ వచ్చారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలో ఎక్కువసార్లు టిడిపికే పట్టం కట్టారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక, అత్యల్ప మెజార్టీ టిడిపిదే..1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల్లో ఒకసారి, 2019 ఎన్నికల్లో మరోసారి తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోను టిడిపి విజయం సాధించింది. నాలుగు సార్లు ప్రజా స్వాతంత్ర పార్టీ, మరో నాలుగు సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించగా ఒకసారి ఇండియన్‌ నేషనల్‌ డెమోక్రసీ పార్టీ తరఫున కోళ్ల అప్పలనాయుడు గెలుపొందారు.నియోజకవర్గ పరిధిలో శృంగవరపుకోట, కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ మండలాలతో పాటు జామి మండలంలో 13 పంచాయతీలు ఉఉన్నాయి. పునర్విభజనతో……1978 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. శృంగవరపుకోట, వేపాడ, జామి, విశాఖ జిల్లా అనంతగిరి, అరకు మండలాలతో కలిపి ఈ నియోజకవర్గం రూపుదిద్దుకుంది. 2009 వరకు గిరిజన నియోజకవర్గంగా కొనసాగింది. నియోజకవర్గ ఆరంభంలో దూరు సన్యాసి దొర, నియోజకవర్గం రద్దు జరిగే ముందు 2004లో కుంభ రవిబాబు మాత్రమే కాంగ్రెస్‌ తరపు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1983లో టిడిపి నుండి గెలుపొందిన ఎల్‌బి దుక్కు వెనక్కి తిరిగి చూడలేదు. 1994 వరకు నాలుగు పర్యాయాలు ఏక చక్రాధిపత్యం వహించారు. ఈ నియోజకవర్గ నుంచి అత్యధిక సార్లు గెలుపొందిన వ్యక్తిగా రికార్డు ఉంది, అప్పటినుంచి ఇప్పటివరకు టిడిపికి ఈ నియోజకవర్గం కంచుకోటలా ఉంది. గిరిజన నియోజకవర్గంగా ఉన్నప్పుడు 2004లో కుంభ రవిబాబు (కాంగ్రెస్‌), 2009 జనరల్‌ గా మారిన తరువాత 2009, 2014లో మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు వారసురాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడలు కోళ్ల లలిత కుమారి టిడిపి నుండి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావు (వైసిపి) నుంచి విజయం సాధించారు, 2024లో టిడిపి నుండి మళ్లీ లలిత కుమారి, వైసిపి నుంచి కడుబండి శ్రీనివాసరావు మరోసారి పోటీ చేస్తున్నారు.

➡️