స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలి : వైద్యారోగ్య శాఖాధికారి భాస్కరరావు

Feb 8,2024 16:18 #vijayanagaram
  • బాలికా శిశు సంరక్షణపై విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-విజయనగరం కోట : స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేసి, నివేదికలను ఈ నెల 15వ తేదీలోగా పంపించాలని, ప్రోగ్రామ్‌ అధికారులను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు కోరారు. పిసిపిఎన్‌డిటి చట్టం-1994పై జిల్లా సలహా మండలి సమావేశం డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. చట్టం అమలుకు జిల్లాలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా డిఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 15 ప్రభుత్వ, 85 ప్రయివేటు స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. వీటన్నిటినీ తనిఖీ చేసి, నివేదికలను ఈ నెల 15లోగా అందజేయాలని చెప్పారు. చట్టంలో పొందుపరిచిన అంశాలన్నిటినీ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు. స్కానింగ్‌ సెంటర్‌ ఇచ్చే బిల్లులపై లింగ నిర్ధారణ పరీక్షలు చట్టప్రకారం నేరం అన్న వాఖ్యాలను తెలుగు, ఆంగ్లంలో తప్పనిసరిగా ముద్రించి ఉండాలని తెలిపారు. అలాగే స్కానింగ్‌ గదివద్దా, పేషెంట్లు వేచిఉండే గది వద్ద ఐఈసి బోర్డులు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్‌ చేసే గదిలో, లింగ నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడే వస్తువులు, ఫొటోలు కూడా లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర కమిషన్‌ ఆదేశాల మేరకు, రిజిష్ట్రేషన్‌ లేకుండా నడుపుతున్న ఎఆర్‌టి, సరోగసి కేంద్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాలికా శిశు సంరక్షణపై విస్తతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈసమావేశంలో పిసిపిఎన్‌డిటి నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అచ్యుతకుమారి, ఉప జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎన్‌.సూర్యనారాయణ, పిఓఎన్‌ఇడి డాక్టర్‌ రవికుమార్‌, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుజాతాదేవి, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుధ, నేచర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దుర్గ, డెమో చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.

➡️