బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జెసి

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌, విజయపురి సౌత్‌ను , 101 మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ సందర్శించారు. ప్రతి వాహనాన్ని వీడియో నిఘాలో సరిగ్గా తనిఖీ చేసి, సీజ్‌లను ఇఎస్‌ ఎంఎస్‌ పోర్టల్‌లో నివేదించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వాహనాల రాకపోకలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. మాచర్ల రూరల్‌ మండలంలోని పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి, ఆయా కేంద్రాలలో కనీస సౌకర్యాలు అయిన త్రాగు నీరు, విద్యుత్‌ సరఫరా, ఓటర్ల కు టెంట్‌ సౌకర్యం, ప్రత్యేక మరుగు దొడ్లు, వీల్‌ చైర్‌ సౌకర్యం, మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

➡️