కాలనీల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత

Jun 16,2024 21:17

ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్‌: పట్టణంలోని అన్ని కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటుకు తగిన ప్రాధాన్యం కలిగేలా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం రాత్రి పట్టణ శివారు కాలనీ అయిన గణేష్‌నగర్‌ కాలనీవాసులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం జిల్లా కేంద్రమైనప్పటికీ గత పాలకుల నిర్వాకం వల్ల పట్టణ పరిధిలో గల ప్రజలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు తగినంతగా జరగలేదని, మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల పట్టణంలోని అన్ని కాలనీలోనూ రహదారులు, కాలువలు, విద్యుత్‌ స్తంభాలు, వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వారికి తగిన రీతిలో సదుపాయాలు కల్పించకపోవడం గత ప్రభుత్వ వైఫల్యం అని దీన్ని పాలకుల వైఫల్యంగా కూడా చెప్పవచ్చునని అన్నారు. టిడిపి హయాంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, బార్నాల సీతారాం, బోను చంద్రమౌళి, రౌతు వేణుగోపాలరావు నాయుడు, గుండ్రెడ్డి రవికుమార్‌, బడే గౌర్నాయుడు, గణేష్‌ నగర్‌ కాలనీవాసులు, తల్లి పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ జి.వాసుదేవరావు, డాక్టర్‌ శ్రీరేఖ దంపతులు, టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో గల లయన్స్‌ క్లబ్‌లో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా బిఎన్‌బి రావు, కార్యదర్శిగా పి.వెంకటప్రసాద్‌ (బుజ్జి), కోశాధికారిగా బలగ వెంకటనాయుడు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోనెల విజరు చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ సేవలు మరింత విస్తతం చేయాలని, నూతన అధ్యక్షులు బిఎన్‌ బి రావు సారధ్యంలో ప్రతి పేదవారికి సేవలు అందాలని కోరారు. ఉత్తరాంధ్రలో గల ఈ క్లబ్‌ రెండో అతిపెద్దదని, లయన్స్‌ క్లబ్‌ కార్యవర్గంలో అనుభవజ్ఞులు, మేధావులంతా ఉన్నారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే విజరు చంద్రకు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు దుస్సాలువుతో సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బార్నాల సీతారాం, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️