రైతుల పొలాలకు దారి చూపించండి : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

May 22,2024 14:55 #AP Rythu Sangam, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : రైతుల పొలాలకు దారి చూపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు మండలం, ఉల్చాల గ్రామంలో వాగు నీటికి కొట్టుకుపోయిన దారికి మరమ్మతులు చేసి రైతుల పొలలకు దారి చూపించాలని కోరుతూ ఆర్డీఓకకు రైతులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాల గ్రామం నుండి సల్కాపురం వెళ్లేదారిలో దాదాపు 500 మంది రైతుల పొలాలు ఉన్నాయని అన్నారు. దారి మధ్యలో వాగుకు వర్షాకాలంలో మాత్రమే నీళ్లు వచ్చేవి అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు భద్రంగా దారి ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. గత నెల నుండి కర్నూల్ నగరానికి మంచినీళ్లు కోసం గాజులదిన్నె ప్రాజెక్టు నుండి ఉల్చాల గ్రామం మీదగా మంచినీళ్లు తీసుకువెళ్తున్నారని ఆ మంచినీటి ప్రవాహానికి రైతులు వేసుకున్న దారి కొట్టుకుపోయిందని తెలియజేశారు. రోడ్డు పాడైపోవడం వలన రైతులు పొలాలకు వెళ్లడానికి సాగు చే సుకోవడానికి పొలాలు చదును చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సంవత్సరం నైరుతి పవనాలు వేగవంతంగా కదలడం చేత రైతులందరూ పంట పొలాలను విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఈ సమయంలో ఉల్చాల గ్రామ రైతులకు రోడ్డు లేకపోవడం చేత పొలాలను విత్తనాలు వేయడానికి సిద్ధం చేయలేకపోతున్నారు కనక జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టి రైతుల పంట పొలాలకు వెళ్లడానికి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు . దారి గుండా ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు ఎలా తీసుకువెళ్లాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకొని వెంటనే మరమ్మతులు చేసి రైతుల పొలాలకు దారి చూపించాలని మనవి చేశారు. వినతి పత్రం స్వీకరించిన కర్నూలు ఆర్డీవో సేశి రెడ్డి స్పందిస్తూ వెంటనే నివేదిక కలెక్టర్ గారికి పంపించి రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గ్రామ రైతులు బడే సాహెబ్ వెంకటయ్య లోకన్నా మద్దిలేటి సత్యరెడ్డి సుధాకర్ మధు నాగన్న తదితరులు పాల్గొన్నారు.

➡️