ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Apr 4,2024 21:37

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్యం చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆర్‌ఒబి వద్ద ఉద్యోగుల తమ న్యాయమైన సమస్యలు పరిష్కారించాలని చేస్తున్న పోరాటం 64 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా టివి రమణ మాట్లాడుతూ యాజమాన్యం ప్రజా ప్రతినిధుల వద్ద కూడా అబద్ధాలు చెప్పి చర్చల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ఉద్యోగులకు చేయవలసిన వేతన ఒప్పందంలో ఉద్యోగులకు మేలు చేసే విధంగా డ్రాఫ్ట్‌ తయారు చేయకుండా ఉద్యోగులను షరతుల పేరుతో ఇబ్బందులు గురి చేసే విధంగా తయారు చేసి ప్రజా ప్రతినిధులను కూడా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం చిత్తశుద్ధితో ఆలోచించి ఉద్యోగులు అడుగుతున్న బకాయిలో ఉన్న డిఎ ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఆగిపోయిన వేతన ఒప్పందం చేయాలని, సస్పెండ్‌లు, వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులిద్దరిని విధుల్లోకి తీసుకోవాలని, చిన్నచిన్న కారణాలతో జరిమానాలు పెనాల్టీలు రికవరీ చేయడం ఆపాలని, సమ్మె కాలానికి జీతం చెల్లించాలని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కె రామారావు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ రావు, ఉద్యోగులు మధు, కామునాయుడు, రాంబాబు, బంగారు నాయుడు, నాగభూషణం, అప్పలనాయుడు, ఆదినారాయణ, గౌరీ, రామలక్ష్మి, మూర్తి, రామకృష్ణ, రామునాయుడు పాల్గొన్నారు.

➡️