స్ట్రాంగ్‌ రూమును తనిఖీ చేసిన ఎస్‌పి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను బుధవారం అర్ధరాత్రి ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24 శ 7 గంటల నిరంతరంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు, నిఘా కెమెరాలతో పర్యవేక్షణలో ఉండాలని అక్కడి సిబ్బందికి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఇవిఎం బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మౌలానా అజాద్‌ ఉర్దూ నేషనల్‌ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములలో తరలించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్‌పి అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎక్కడా నలుగురు అంతకు మించి గుంపులు, గుంపులుగా ఉండకూడదని చెప్పారు. అనుమతులు లేకుండా ఎక్కడ సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌పితోపాటు అడిషనల్‌ ఎస్‌పి ఎస్‌.ఎస్‌.ఎస్‌.వి కష్ణారావు, ఎ.ఆర్‌ డిఎస్‌పి మురళీధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️