అంగన్వాడీల నిర్బంధం

Jan 3,2024 22:29

 మడకశిర పోలీసుస్టేషన్‌ బయట ఎండలో కూర్చొన్న అంగన్వాడీలు

                       మడకశిర : తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కలెక్టర్‌ ముట్టడికి వెళ్లకుండా అంగన్వాడీలను పోలీసులు నిర్బంధించారు. బుధవారం సత్యసాయి జిల్లా కలెక్టర్‌ ముట్టడికి వెళుతున్న మడకశిర నియోజకవర్గంలోని అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డగించారు. పలువురిని మడకశిర స్టేషన్లో నిర్బంధించారు. పట్టణంలో ఉదయం ఐదు గంటల నుండే పోలీసులు అన్ని బస్సులను తనిఖీ చేసి అంగన్వాడీలను అడ్డుకొని స్టేషన్కు తరలించారు. తమ సొంత వాహనాలు ఇతర వాహనాలలో వెళుతున్న అంగన్వాడీలను కూడా పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంగన్వాడీలకు స్టేషన్లో ఎలాంటి సౌకర్యం లేక ఎండలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెనుకొండ : కలెక్టర్‌ ముట్టడికి వెళతారన్న ఉద్దేశ్యంతో పోలీసులు స్థానిక అంగన్వాడీలను బుధవారం తెల్లవారుజామున 3గంటలకు అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై సిఐటియు రమేష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కపట్నం : అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌ హెచ్చరించారు. బుధవారంకలెక్టర్‌ ముట్టడికి వెళుతున్న అంగన్వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించడం దుర్మార్గమని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుందని అలా చేస్తే అంగన్వాడీలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సిపిఎం నాయకులు బ్యాల అంజి అంజి, నాగమణి, జ్యోతి తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లేపాక్షి : కలెక్టరేట్‌ ముట్డడికి వెళుతున్న స్థానిక అంగన్వాడీలను లేపాక్షి పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా సిఐటియు నాయకులను, అంగన్వాడీలను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి అర్బన్‌ : కలెక్టరేట్‌ ముట్టడికి వెళుతున్న అంగన్వాడీలను, సిఐటియు నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా సిఐటియు నాయకులు నరసింహులు బాబ్జాన్‌ జగన్మోహన్‌ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు మాబున్నీసా మాట్లాడుతూ కనికరము లేని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో తగిన సమయంలో గుణపాఠం నేర్పుతామని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముదిగుబ్బ : కలెక్టరేట్‌ ముట్టడికి వెళుతున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్గు చేశారు. ఈసందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఆటో పెద్దన్న మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. పుట్టపర్తి అర్బన్‌ : అంగన్వాడీలు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు కొనసాగించారు. అంగన్‌వాడీ యూనియన్‌, సిఐటియు నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామునే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ను అరెస్టు చేసి నల్లమాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్‌ జిల్లా వర్కర్ల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణను పుట్టపర్తికి రాకుండా అమడగూరులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి పైపల్లి గంగాధర్‌ను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. పలువురు అంగనవాడి యూనియన్‌ నాయకురాళ్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ అరెస్టులను సిఐటియు ఉపాధ్యక్షులు ఎం.ఇంతియాజ్‌, శ్రామిక మహిళా సమాఖ్య కార్యదర్శి దిల్షాద్‌బి, అంగన్వాడీల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి తదితరులు ఖండించారు.

➡️