‘అనంత’ నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

Feb 21,2024 21:40

హిందూపురంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

                          హిందూపురం : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎపిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్‌ శైలజనాథ్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శైలజనాథ్‌, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు జంగా గౌతమ్‌, ఏఐసీసీ మెంబర్‌ కెటి శ్రీధర్‌, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి సత్తార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బాలాజీ మనోహర్‌, హరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజనాథ్‌ మాట్లాడుతు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు షర్మిల అధ్యక్షతన ఈనెల 26న అనంతపురంలో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌, కాంగ్రెస్‌ పెద్దలు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు, తదితర మఖ్యనాయకులు పాల్గొంటారని చెప్పారు. జగన్‌ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టిందన్నారు. ఆ భయం నుంచి బయటపడడానికి అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని, వందల కోట్లు ఖర్చు పెడుతూ సిద్ధం సభలను ఏర్పాటు చేసి జన బలాన్ని చూపిస్తోందని విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో జిల్లా అభివృద్ధికి ఏం చేశారో చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ బలపడితే వైసిపి ఖాళీ అవుతుందన్న భయంతో నాయకులను ప్రజలను ఆకర్షించుకోవడానికి సిద్ధం సభలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తూ బల ప్రదర్శన చేపడుతున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి సోది వినలేక జనాలు వెనక్కి వెళుతున్న తరుణంలో ఆ దృశ్యాలను చిత్రీకరించిన మీడియా ఫోటోగ్రాఫర్‌ పై దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఈనెల 26న అనంతపురంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రౌఫ్‌సాబ్‌, అతావుల్లా, అమానుల్లా, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌దే భవిష్యత్తు పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రంలో ప్రత్యామ్నాయం, భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌దే అని పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి సాకే శైలజనాథ్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణం లోని మేడ అతిధిగృహంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పుట్ల గంగాద్రి అధ్యక్షతన నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ జరగనున్నదన్నారు. ఆ సభలో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్‌ షర్మిలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుతుందన్నారు. వైసిపి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఆ సభకు ప్రతి నియోజకవర్గంలో నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. వర్కింగ్‌ అధ్యక్షులు గౌతం మాట్లాడుతూ ఇటు తెలంగాణ అటు కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల పనితీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. తిరిగి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పట్ల ప్రజలలో నమ్మకం ఏర్పడుతోందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కోట సత్యం, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాలాజీ మనోహర్‌, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి ఖాసీంఖాన్‌, కెటి. శ్రీధర్‌, ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఖాజీ షకీరా, పటాన్‌ గౌస్‌తో పాటు ఆరు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.

➡️