అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేం

సంజీవపురం గ్రామంలో ముళ్లగిరి వెంకటరాముడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న భువనేశ్వరి

         బత్తలపల్లి : టిడిపి, చంద్రబాబు నాయుడు మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమ వేలకట్టలేనిదని, ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం నారా భువనేశ్వరి తెలిపారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 2వ రోజు ఆమె పర్యటించారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, ధర్మవరం పట్టణాల్లో బుధవారం పర్యటించి, పలు కుటుంబాలతో మాట్లాడారు. బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో ఏర్పాటుచేసిన మహిళల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ,మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో చేనేత కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంజీవ పురం గ్రామంలో ముల్లగూరు వెంకటరాముడు, సాకే చెక్కీరయ్య ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. పర్యటన సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులపాటు జైల్లో పెట్టారన్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూపిన ప్రేమను తాము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించాలన్న ఉద్ధేశంతో ఈ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్‌, టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి, బండారు శ్రావణి, సవితమ్మ, టిడిపి కుమ్మర శాలివాహన సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మదనాపు పోతులయ్య, తెలుగు రైతు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంటాపురం జగ్గు, ధర్మవరం నియోజవర్గం తెలుగు రైతు అధ్యక్షులు చల్లా శ్రీనివాసులు, టిడిపి మండల కన్వీనర్‌ గోనుగుంట్ల నారాయణరెడ్డి, జక్కంపూడి నాగభూషణ, సంగాల సూరి, తెలుగు యువత నాయకులు తాళ్లూరు సతీష్‌ కుమార్‌ చౌదరి, రామాపురం కేశవ, చిట్ర నాగభూషణ, బీదల నారాయణ స్వామి పాల్గొన్నారు.

➡️