ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి చర్యలు

Dec 13,2023 22:43

 తహశీల్దార్‌తో మాట్లాడుతున్న నాయకులు

                   గోరంట్ల : మండలంలోని పాలసముద్రం గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి అలాగే అనుభవంలో ఉన్న వారికి పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వటానికి తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ రంగనాయకులు తెలిపారు. ఈ మేరకు ఇళ్లస్థలాల సమస్యపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో పాలసముద్రం గ్రామానికి చెందిన పేదలతో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ బుధవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ రంగనాయకులు మాట్లాడుతూ పాలసముద్రం గ్రామానికి చెందిన అర్హులైన పేదలకు అనుభవంలో ఉన్న వడ్డెర్లకు పొజిషన్‌ సర్టిఫికెట్లు వీలైనంత తొందరగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో పట్టాలు పొందిన వారికి పట్టాలు పరిశీలించి స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామన్నారు. ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను ఆధార్‌, రేషన్‌, ఓటరు కార్డు ప్రామాణికంగా తీసుకొని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకొని 90 రోజుల్లో పట్టాలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ పేదల ఐక్య పోరాటంతో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారుల నుండి సానుకూలత వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు అంజలాదేవి, వెంకట లక్ష్మమ్మ, అచ్చమ్మ, అశ్విని, నారాయణ, రామాంజనేయులు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

➡️