ఎన్నికలలో మీడియా పాత్ర కీలకం

Mar 7,2024 22:19

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ కొండయ్య

                                  పుట్టపర్తి అర్బన్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ప్రజలకు సరైన సమాచారం అందించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 పై మీడియా ప్రతినిధులకు గురువారం స్థానిక కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ పక్రియకు సంబంధించి పలు విషయాలను వివరించారు. అలాగే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ సమయంలో మీడియా పాత్ర ప్రధాన భూమిక పోషించవలసి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించే విధంగా మీడియా ప్రతినిధులు ప్రవర్తించాలన్నారు. జిల్లా యంత్రాంగం తరపున ఎన్నికలకు సంబంధించిన విషయాలలో తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నామినేషన్‌ విడుదల నుంచి ఎన్నికల ఫలితాలు వెలుపడేదాకా మీడియా ప్రతినిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఒ వేలాయుధం, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్‌ మైముద్దీన్‌, డిఐఇ ఇంజనీరింగ్‌ విభాగం రామాంజనేయులు, ఎటిఆర్‌ఒ ఫక్రుద్దీన్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️