కానిస్టేబుల్‌ గణేష్‌కు కన్నీటి వీడ్కోలు

గణేశ్‌ పార్థివదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచుతున్న బెటాలియన్‌ డిఐజి వెంకటేశ్వర్లు

               ధర్మవరం టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోబోయి వీరమరణం పొందిన 14వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రులు, తోటి సిబ్బంది కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసు లాంఛనాలతో గణేష్‌ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం ధర్మవరం పట్టణం గుట్టకిందపల్లిలో బుధవారం నిర్వహించారు. బెటాలియన్‌ డిఐజి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు పోలీసు సిబ్బంది హాజరై గణేష్‌కు నివాళులు అర్పించారు. బెటాలియన్‌ సిబ్బంది పాడేమోసి మిత్రుడు గణేశ్‌పై వారికున్న ప్రేమను చాటుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా పోలీసు శాఖ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇక గణేష్‌ను చివరి సారి చూసేందుకు గ్రామస్తులు, మిత్రులు పెద్ద సంఖ్యలో గుట్టకిందపల్లి గ్రామానికి వచ్చారు. గణేష్‌ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యవంతం అయ్యారు. పదేళ్లలోపు ఉన్న పిల్లలు ఇద్దరు తండ్రి మతదేహాన్ని చూస్తూ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. నిబద్ధత గల ఉద్యోగిని కోల్పోయాండిఐజి వెంకటేశ్వర్లు14వ బెటాలియన్‌లో గణేశ్‌ ఉద్యోగ భాధ్యత తీసుకున్నప్పటి నుంచి వత్తి పట్ల ఎంతో నిబధ్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందారని డిఐజి వెంకటేశ్వర్లు తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసిన గణేశ్‌ వీరమరణం పొందడం బాధాకరం అన్నారు. నిబద్ధత గల ఉద్యోగిని పోలీసు శాఖ కోల్పోవడం తీరని లోటు అన్నారు. గణేశ్‌ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు.

➡️