కెజిబివిలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు

Dec 12,2023 21:38

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారి

               చిలమత్తూరు : స్థానిక కెజిబివిలో కాలంచెల్లిన పాలప్యాకెట్లను వినియోగిస్తున్నారు. సోమవారం కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎంపిడిఒ నరేష్‌ క్రిష్ణ, ఎంఇఒ సల్మాన్‌ రాజ్‌, డిసిడిఒ మాధవి తదితరులు స్థానిక కెజిబివిని తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించిన అధికారులు అక్కడ కాలం చెల్లిన పాలప్యాకెట్లు ఉండటాన్ని గమనించారు. 11 వ తేదీనాటికే కాలం ముగిసిన పాలప్యాకెట్లను వాడుతుండటాన్ని గమనించిన అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందా అని మండిపడ్డారు. విద్యార్థులను మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని తేల్చారు. అలాగే మరుగుదొడ్లు నిర్వహణ, భవన నిర్వహణ అపరిశుభ్రంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే విద్యార్థులలో పోష్టికాహారలోపంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ ముందు గాయిత్రి పాలు అందజేసే వారని అయితే ఇప్పుడు ”అమ్మ” పాల ప్యాకెట్లు అందజేస్తున్నారని అధికారులు తెలిపారు.కాంట్రాక్టర్‌ వేలం పాట సమయంలో ఏ బ్రాండ్‌ పాలప్యాకెట్లు అందజేస్తానని తెలిపారో అవే సరఫరా చేయల్సి ఉందన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం విషయంపై అధికారులు ఉపాధ్యాయులను, విద్యార్థినులను విచారించారు. విద్యార్థిని సున్నిత మనస్కురాలు కావటంతో మనోవేదనకు గురైందని తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అన్నారు.

➡️