టిడిపి నాయకుని దారుణ హత్య

అమర్‌నాథ్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

ప్రజాశక్తి – నల్లమాడ, పుట్టపర్తి అర్బన్‌

శ్రీ సత్యసాయి జిల్లా పట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కటాలపల్లి గ్రామంలో టిడిపి నాయకుడు ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. తోట వద్ద నిద్రించిన దుద్దుకుంట అమర్నాథ్‌రెడ్డి(40)ను గుర్తు తెలియని వ్యక్తలు వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. కాగా ఈ హత్య రాజకీయ హత్యని టిడిపి నాయకలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం హత్యలో రాజకీయ కోణం లేదని, వ్యక్తిగత ఘర్షణలతోనే హత్య జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపి నాయకుడు హత్యకు గురికావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కుటాలపల్లి గ్రామానికి చెందిన దద్దుకుంట అమర్నాథ్‌ రెడ్డి(40) గతంలో వైసిపిలో ఉండేవాడు. ఆరు నెలల క్రితం టిడిపిలో చేరాడు. అప్పటి నుంచి టిడిపి నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఈయన కటాలపల్లి గ్రామంలోని తన మామిడితోటలో నిద్రించేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవలితో నరికి హత్య చేశారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు రక్తపు మడుగులో ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించి పోలీసులు, కుటుంబ సభ్యలకు తెలియజేశారు. ఘటనా స్థలాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ వాసుదేవన్‌లు పరిశీలించారు. అమర్నాథ్‌రెడ్డిని రాజకీయ కక్షతోనే ప్రత్యర్థులు హత్య చేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య, కూతురు,కుమారుడు ఉన్నారు.

రాజకీయ కారాణాలు లేవు : ఎస్పీ, డీఎస్పీ

కుటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్‌ రెడ్డి హత్య కేవలం వ్యక్తిగత కారణాలతోనే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. హత్య విషయం తెలుసుకున్న శ్రీస్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సోమవారం ఉదయం కటాలపల్లి గ్రామంలోని ఘటనా స్థలాన్ని డీఎస్పీ వాసుదేవన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించి డీఎస్పీ ప్రత్రికా ప్రకటన విడుదల చేశారు. అమర్నాథ్‌ రెడ్డిని వ్యక్తిగత కారణాలవల్లే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. హత్య కేసును వెంటనే ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. కాగా టిడిపి నాయకుని హత్య విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కటాలపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆయన కోరారు.

కటాలపల్లిలో టెన్ష్‌న్‌ వాతావరణం

నల్లమాడ మండలం కటాలపల్లి ప్రశాంతంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో గతంలో ఎప్పుడూ కూడా హత్యలు జరగలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టిడిపి నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. దీంతో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో హత్య చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. హత్య విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో కటాలపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఓ వైపు పోలీసులు హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెబుతున్నా, టిడిపి నాయకులు మాత్రం ఇది రాజకీయ హత్యనే చెబుతున్నారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని టిడిపి ముఖ్య నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, నాయకులు మైలే శంకర్‌, డాక్టర్‌ బుట్టి నాగభూషణం నాయుడు, మాజీ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, కులశేఖర్‌ నాయుడు తదితరులు హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

➡️