తడిసి మోపెడవుతోంది..!

         అనంతపురం ప్రతినిధి : ఎన్నికలంటేనే ధన ప్రవాహంగా మారిన విషయం తెలిసిందే. ప్రచారంలో అడుగుతీసి అడుగు వేయాలంటే వేలల్లో ఖర్చు చేయాలి. హంగూ ఆర్భాటాలతో చేయాలంటే రోజుకు లక్షల్లోనే అవుతుంది. ఈ ఖర్చులతో అభ్యర్థలు ఖంగుతింటున్నారు. నీళ్లలో నోట్ల కట్టలు ఖర్చు చేయాల్సి రావడంతో ప్రచారం అంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యుల్‌ వెలువడంతో ప్రచార హడావుడి పెరిగింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యం కావడంతో అందరినీ బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చిన ఫలితాలపై ప్రభావం ఉంటుంది. దీంతో టిక్కెట్టు ఖరారైన నాయకులు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలూ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ రకమైన ఏర్పాట్లు చేయడానికి నేతలకు తడిసి మోపెడవుతోంది. దీంతో ప్రచారాలకు బయటకు అడుగు పెట్టాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. సమయమైనా తక్కువ ఉంటే ఖర్చు కొంత తక్కువగా ఉండేదని, ఎన్నికల సమయం చాలా ఎక్కువగా ఉండటంతో రోజువారి ఖర్చు భారీగా పెరుగుతోందని అభ్యర్థులు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకునే పరిస్థితులున్నాయి. దీంతో కొంత మంది ఇప్పటికప్పుడు ప్రచారాలు ప్రారంభించడం ఎందుకని తాము దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులను ప్రచారాలకు తిప్పుతున్నారు. వారైతే కొంత ఖర్చు తగ్గుతుందని, చివరాఖర్లో తాము ప్రచారాలు మొదలుపెడితే సరిపోతుందన్న భావనలోనున్నట్టు తెలుస్తోంది. ప్రచారం నిమిత్తం అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు బయటకు వెళితే రోజుకు సగటున ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తున్నట్టు ఒక అంచనా. ఇంకా ఎన్నికలకు 48 రోజుల వరకు సమయముంది. ఈ లెక్కన అన్ని రోజులకు కలిపి తక్కువలో తక్కువ అన్న రెండున్నర కోట్ల రూపాయల వరకు సాధారణ ఖర్చులకే అవుతోంది. ఇక నామినేషన్ల తరవాత నుంచి ఈ ఖర్చు రెండింతలు పెరిగే అవకాశముంది. ఆ తరువాత ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచే డబ్బులు కలిపి మొత్తం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు. పోటీ ఎక్కువ ఉన్న చోట మరింత భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యుల్‌ నాలుగో విడత కాకుండా ముందుగా వచ్చి ఉంటే చాలా వరకు ఖర్చు తగ్గి ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. కులాలు, బలమున్న నాయకులను ఆకర్షించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకు అవసరమైన తాయిళాలు, పనులు చేసి పెడుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంత ఖర్చు అవుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు భయపడిపోతున్నారు. ఇదే సమయంలో రంజాన్‌ వంటి పండుగలు కూడా రావడంతో ఇప్తార్‌ విందులు ఇవ్వాల్సి వస్తోంది. మైనార్టీలను ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. నేరుగా తమ పేరు మీద కాకుండా అనుయాయుల పేర్లతో వారు విందు ఇస్తే తాము పాల్గొంటున్నట్టుగా సాగుతున్నాయి. యువతకు ప్రత్యేకమైన విందులు, క్రీడా సామగ్రి అందించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇన్ని రకాల ఖర్చులు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెట్టకపోతే ప్రత్యర్థి కంటే వెనుకబడి పోతామన్న భయం వెంటాడుతోంది. ఇలా ఖర్చుతో అభ్యర్థులు ప్రచారం అంటేనే భయపడాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి.

➡️