నేడు పెనుకొండలో ‘రా.. కదలిరా..’

Mar 3,2024 22:09

సభాస్థలి వద్ద టిడిపి నాయకులు

                            అనంతపురం ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం నేటితో ముగియనుంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో జరిగే ఈ సభకు ఆ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నాయి. ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మార్పు చేశారు. ప్రస్తుతం పెనుకొండలో ఏర్పాటు చేశారు. రా కదలిరా సభ అంతకు మునుపు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేశారు. ఆశిచినంత మేరకు జన సేకరణ చేపట్టి సభను విజయవంతం చేశారు. ఇదే నేపథ్యంలో వైసిపి ఫిబ్రవరి 18వ తేదీన సిద్ధం సభను రాప్తాడులో ఏర్పాటు చేసింది. రాయలసీమస్థాయి సభకు లక్షలాది మంది జనసమీకరణ చేపట్టి బలప్రదర్శన చేసింది. ఈ సభ జరిగిన చోటనే రాప్తాడులో రా కదలిరా సభను నిర్వహించాలని మొదట టిడిపి భావించింది. అయితే చివరి నిమిషంలో మార్పు చేసి పెనుకొండకు మార్చింది. కియా సమీపంలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబునాయుడు పెనుకొండకు రానున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు సభ పూర్తవనుంది. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి జనసమీకరణ చేపట్టే ఏర్పాట్లలో పార్టీ నేతలున్నారు. ఈ సభతో రా కదలిరా కార్యక్రమాన్ని ముగించి ప్రజాగళం పేరుతోకార్యక్రమాలను రూపొందించేందుకు పార్టీ సిద్ధమైంది. ఆఖరు సభ కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని టిడిపి భావిస్తోంది. అసంతృప్తులను గాడిలో పెట్టేరా ? టిడిపి జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు ఈ పర్యటన సందర్భంగానైనా అసంతృప్తులను గాడిలో పెడతారా అన్న చర్చ నడుస్తోంది. ఇటీవలనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను టిడిపి ఖరారు చేసింది. ఇందులో అనేక చోట్ల అసంతృప్తులున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటించే పెనుకొండలోనే సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారధి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు కాకుండా సవితకు టిక్కెట్టు ఇచ్చారని ఒక గ్రూపు అలకబూనింది. అదే విధంగా కళ్యాణదుర్గం, శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ అసంతృప్తులున్నాయి. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు వీటన్నింటిపై నేతలతో చర్చిస్తారా లేక కార్యక్రమం ఒక్కటికే పరిమితమవుతారా అన్న చర్చ నడుస్తోంది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే అసంతృప్త నేతలతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో వీరి ఏ మేరకు సహకరిస్తారన్న సందేహాలు మాత్రం అభ్యర్థుల్లోనూ ఉన్నాయి. అదే విధంగా ఎన్నికలు సమీస్తుండటంతో పార్టీ శ్రేణులకు ఏ రకంగా మార్గనిర్ధేశం చేస్తారోనని ఆపార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట లాంటిది. అటువంటిది గత ఎన్నికల్లో ఘోరంగా పరాయజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తిరిగి పార్టీ పుంజుకోవడానికి ఎటువంటి మార్గదర్శకాన్ని సూచిస్తారోనని ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.

➡️