నేడు ‘సిద్ధం’ సభ

 సిద్ధం సభ బహిరంగ స్థల ప్రాంగణం

     అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు వైసిపి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధం పేరుతో ప్రాంతీయ సభలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కేంద్రం సమీపంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. రాయలసీమ పాత నాలుగు జిల్లాల నుంచి లక్ష మందికిపైగా జనసమీకరణ చేపట్టి తమ బలాన్ని ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రాప్తాడు ఆనుకుని పొలాల్లో 110 ఎకరాల్లో బహిరంగ సభ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తోంది. భారీ వేదికతోపాటు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మధ్యలో నడిచివెళ్లేందుకు వీలుగా తొమ్మిది అడుగుల ఎత్తులో వాక్‌వేను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో నడిచే వెళ్లే సమయంలో ముఖ్యమైన వారిని పలుకరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు రోజులుగా ఇక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. ఈయనతోపాటు ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశీల రఘురాం కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

      ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అనంతపురంలో జరుగుతున్న రాయలసీమ స్థాయి సిద్ధం బహిరంగ సభలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి విమనాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో రాప్తాడుకు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం హెలీక్యాప్టర్‌లో పుట్టపర్తికి అక్కడి నుంచి గన్నవరంకు బయలుదేరి వెళ్తారు.

భారీ భద్రతా, ట్రాఫిక్‌ మల్లింపులు

           రాయలసీమ జిల్లాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయనుండటంతో అందుకు తగ్గట్టు భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తుండగా అదనంగా కడప, నంద్యాల, చిత్తూరు జిల్లాల అదనపు ఎస్పీలు కూడా ఇక్కడికి విచ్చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసు సిబ్బందిని భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. ఇదే విధంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతున్నారు. సభకు వచ్చే వాహనాలకు ఆయా మార్గాల ద్వారా వచ్చే వాటి పార్కింగ్‌ కోసం 16 స్థలాలను ఏర్పాట్లు చేశారు.

ఈ సభ తరువాత ఎన్నికల ఊపు పెరుగుతుంది..

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

          రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభ అనంతరం ఎన్నికల ఊపు వైసిపిలో మరింత పెరుగుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సభా ప్రాంగణంలో పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో వైసిపి గెలుపొందుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వైసిపి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలిరానున్నట్టు తెలిపారు. భారీగా ఈ సభను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు సిద్ధం సభలను నిర్వహించినట్టు తెలిపారు. మరో సభ పల్నాడులో నిర్వహించనున్నట్టు వివరించారు.

రాయలసీమ సమస్యలను ప్రస్తావించేరా ?

           నిత్యం కరువులకు నిలయం రాయలసీమ. సాగు, తాగునీటి కష్టాలతోపాటు, ఉపాధి కోసం వలసలు అధికంగా ఉండే ప్రాంతం ఇది. అత్యల్ప సాగునీటి వసతి ఉన్న ప్రాంతం కూడా ఇదే కావడం గమనార్హం. అధికార పార్టీ రాయలసీమ స్థాయిలో నిర్వహిస్తున్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈప్రాంత సమస్యలపై ప్రస్తావిస్తారా.. లేక రాజకీయ అంశాలపైనే దృష్టి పెడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకమని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పనులేవి ముందుకు సాగిన దాఖలాల్లేవు. ఇక పరిశ్రమలు ఒకటి, రెండు ప్రకటించినా ఏర్పాటవలేదు. కడప ఉక్కుపరిశ్రమ ఏర్పాట్లుకు శంకుస్థాపన చేసినా ప్రయివేటు రంగంలోనే అన్న విమర్శ ఉంది. అనంతపురం జిల్లాలో గతంలో ప్రకటించిన కుదురేముఖ్‌ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేకుండాపోయింది. తాగునీటి కోసం తెస్తామన్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులు మొదలవ లేదు. ఇలా అనేక సమస్యలు రాయలసీమకు సంబంధించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి సద్ధం సభలో వీటిపైనా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎటువంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ట్రాఫిక్‌ ఆంక్షలు సడలింపు

          ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలను సడలిస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్‌ మళ్లింపునకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయం పేరున శుక్రవారం ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. సదరు ప్రెస్‌ నోట్‌ లో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను హైవేపై కాకుండా మామిళ్లపల్లి దగ్గర మళ్లించి నూతిమడుగు, కళ్యాణదుర్గం, అనంతపురం మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలని… అదేవిధంగా హైదరాబాద్‌ నుండీ బెంగుళూరు వెళ్లే వాహనాలు అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి వద్ద మళ్లించి తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, నార్పల, బత్తలపల్లి, ధర్మవరం, మామిళ్లపల్లిల మీదుగా వెళ్లాలని సూచించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు కేవలం భారీ గూడ్స్‌ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని, మిగితా అన్ని రకాల వాహనాలు, అత్యవసర వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు యథావిధిగానే అనంతపురం మీదుగానే హైవే-44పై వెళ్లవచ్చన్నారు.

➡️