పది పరీక్షలకు సర్వం సిద్ధం

విలేకరులతో మాట్లాడుతున్న డిఇఒ మీనాక్షి

       కొత్తచెరువు రూరల్‌ : శ్రీ సత్యసాయి జిల్లాలో ఈనెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసినట్లు డిఇఒ మీనాక్షి తెలిపారు. గురువారం నాడు కొత్తచెరువులోని డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో 439 పాఠశాలల పరిధిలో 27,555 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాల్లో బాలురు 11,484, బాలికలు 10,518, మొత్తం 22,002 మంది ఉన్నారు. ఇక ప్రయివేటు విద్యాసంస్థల్లో బాలురు 3,536, బాలికలు 2,017, మొత్తం 5553 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్లుగా ఏర్పాటు చేసి 115 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పదవ తరగతి పరీక్షకు ఇన్విజిలేటర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు 115 మది, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌ 115, అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌ 14, ఇన్విజిలేటర్స్‌ 1250 మందిని నియమించామన్నారు. 60 సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్‌ స్వ్కాడ్‌, 6 ప్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు అనుమతి లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరిద్దరు విద్యార్థులను 15 నిమిషాలు ఆలస్యం అయినా కేంద్రంలోకి అనుమతించ వచ్చునని తెలియజేశారు.

➡️