ప్రభుత్వ పాఠశాలకు ‘ప్రయివేటు’ గ్రహణంప్రభుత్వ పాఠశాలకు ‘ప్రయివేటు’ గ్రహణం

Feb 29,2024 21:29

పొట్టిశ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల      

                  చిలమత్తూరు : 60 సంవత్సరాల చరిత్ర కలిగిన చిలమత్తూరు మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ప్రయివేటు గ్రహణం పట్టుకుంది. పదోతరగతి పరీక్షకేంద్రాన్ని ఓ ప్రయివేటు పాఠశాలకు మార్చడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాటి నుండి నేటి వరకు మండల వ్యాప్తంగా ఉన్న కోడూరు హై స్కూల్‌, కొడికొండ హైస్కూల్‌, చిలమత్తూరు హైస్కూల్‌, ఎంజేపీ స్కూల్‌ , కేజీబీవీల విద్యార్థులు పొట్టిశ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే పరీక్షలు రాసేవారు. అయితే తొలిసారి ప్రయివేటు పాఠశాలకు పరీక్ష కేంద్రాన్ని తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 604 మంది విద్యార్థులు ఉన్నారు. అతిపెద్ద పాఠశాలగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో నాడు-నేడు, ఆర్డీటీ, నాబార్డు, సెహగల్‌ పౌండేషన్‌ వారు నిర్మించిన బహుళ అంతస్తుల బిల్డింగ్‌లు ఉన్నాయి. చుట్టూ ఎత్తైన కాంపౌండ్‌తో పాటు అన్ని వసతులు ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ పాఠశాలలో పది పరీక్ష కేంద్రం ఎత్తివేయడం పై ఇటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇది విధ్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శంగా అభివర్ణిస్తున్నారు. పొట్టిశ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగుతామని వారు చెప్పారు.

➡️