బీసీ కాలనీలో తాగునీటి కష్టాలు

Mar 29,2024 22:17

 కొళాయి ద్వారా టబ్‌ లోకి కారుతున్న నీటిని సేకరిస్తున్న బాలుడు

                          చిలమత్తూరు : మండల కేంద్రంలోని బీసి కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. 2 నెలలుగా నీటి సమస్య నెలకొన్నా పంచాయతీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నీటి కష్టాలలో ఉన్న తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసి కాలనీలలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. బోరు పనిచేయక పోతే ట్యాంకర్ల ద్వార నైనా నీరు అందించాల్సి ఉన్న అ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. కాలనీలో నీటి సమస్య తీర్చమంటే ఎన్నికల కోడ్‌ ఉందని పంచాయతీ సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు దీన్నే సాకుగా చూపి రెండు నెలల తర్వత అని ముఖం చాటేస్తున్నారు. దీంతో పంచాయతీ ప్రజలు బిందె నీటికి రూ. 5 నుండి 10 రూపాయల వరకు వెచ్చించి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఎప్పుడో వారానికి ఒక్క సారి వచ్చే ఉప్పునీరు కేవలం ఒకటీ లేదా రెండు బిందెలు మాత్రమే వస్తాయని అవి కూడా ఏ సమయంలో వస్తాయో తెలియక కొళాయి వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఉప్పు నీరు వస్తున్న క్రమంలో కొద్ది పాటు నీటిని టబ్‌ అడ్డుగా పెట్టి అందులోంచి బాలుడు బిందెలలో నింపడం కాలనీలో నీటి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సమస్యపై కలెక్టర్‌ స్పందించి తమ నీటి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

➡️