బెదిరింపులకు భయపడం

Jan 17,2024 22:30

సోమందేపల్లిలోని సమ్మెలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

                         సోమందేపల్లి : అంగన్వాడీ కార్మికులు గత 37 రోజులుగా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మె చేస్తుండగా ప్రభుత్వ పెద్దలు డిమాండ్లు నెరవేర్చకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తిరిగి అధికారంలోకి ఎలా రావాలని ఆలోచనలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. మహిళలు రోడ్లెక్కి పోరాటం చేస్తుంటే వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి వారి డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నారని అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ కార్మికులు స్థానిక సాయిబాబా గుడి ఆవరణ నుండి సిడిపిఒ కార్యాలయం వరకు నడుచుకుంటా వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై నోటీసులు అందజేశారు. పెనుకొండ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో 37వ రోజు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్బంగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నుండి ఐ సి డి ఎస్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు రిప్లై నోటీసులు ఇవ్వడానికి వెళితే సిడిపిఒ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో షోకాజ్‌ నోటీసులను ఆఫీస్‌ గోడలకు అతికించారు. చివరకు సిడిపిఒ వచ్చి రిప్లై నోటీసులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుండి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సమ్మెను ఉధృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు తిప్పన్న, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు జయమ్మ, బావమ్మ, సెక్టార్‌ లీడర్లు మాబున్నీసా, వరలక్ష్మి, అనిత, శ్యామల గౌరి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవరచెరువు : ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె కొనసాగించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు రంగమ్మ, మణిమాల, ,కిష్టమ్మ, కమలమ్మ, వరలక్ష్మి, అరుణమ్మ, అనసూయ, సుకన్యతో పాటు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లాకార్యదర్శి వేమయ్య యాదవ్‌ విమర్శించారు. ఆంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 37వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్య యాదవ్‌, ఏపీచేనేత కార్మికసంఘం తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఏపీ రైతుసంఘం జిల్లా ఆధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం సీనియర్‌ నాయకుడు ఎస్‌ హెచ్‌ బాషా, సిఐటియు మండల అధ్యక్షులు ఎల్‌ఆదినారాయణలు సంఘీభావం తెలిపారు. కదిరి అర్బన్‌ : అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరుకుంది. బుధవారం దీక్షా శిబిరం వద్ద డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయి లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 37 రోజుల పాటు సమ్మెను కొనసాగిస్తుంటే సమ్మెను పరిష్కరించకపోగా సమ్మెను విచ్చినం చేయడానికి ఏస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమన్నారు. షోకాజ్‌ నోటీసుల ద్వారా అంగన్వాడీలను భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మాబున్నీసా, చంద్రకళ, సువర్ణ, లక్ష్మీదేవి, సుజాత, రామలక్ష్మమ్మతో పాటు సిఐటియు నాయకులు జిఎల్‌. నరసింహులు, జగన్మోహన్‌, ముస్తాక్‌, నాయకులు బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌: అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని అంగన్వాడీ ప్రాజెక్టు, సిఐటియు నాయకులు పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పుట్టపర్తిలోని సిడిపిఒ కార్యాలయానికి తరలివెల్లి ప్రభుత్వం అందజేసిన షోకాజ్‌ నోటీసులకు బదులు నోటీసులు అందజేశారు. పుట్టపర్తి లోని సత్యమ్మ గుడి వద్ద నుండి సాయి నగర్‌ లోని సిడిపిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయి నగర్‌ లోని సిడిపిఒ కార్యాలయానికి చేరుకుని అక్కడ మూడు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమకు అందించిన నోటీసులను సిడిపిఒ గాయత్రికి వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా అంగన్వాడీల పోరాటం సాగుతుందని న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా సమ్మెను విరమించమంటే ఏ విధంగా విరమిస్తామని తెలిపారు. అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేసి విధులకు హాజరుకాకుండా హాజరైనట్టు లెక్కలు చూపుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంజి ప్రాజెక్టు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, పుట్టపర్తి ప్రాజెక్టు అధ్యక్షులు సుజాత కోశాధికారి మంజుల ప్రాజెక్టు లీడర్లు, భగవతి, అరుణ, అనిత, యశోద, అనంతమ్మ జ్యోతి, అంగన్వాడీలు పాల్గొన్నారు. నల్లచెరువు : ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట మండలాలలోని అంగన్వాడీలు బుధవారం 37వ రోజు నల్లచెరువులో ర్యాలీ నిర్వహించారు. 37 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు సృష్టించినా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానంగా నల్లచెరువు ప్రాజెక్ట్‌ సిడిపిఒకు రిప్లై నోటీసులు అందజేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ, వేమన్న, రైతు సంఘం నాయకులు శివన్న, శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రమేష్‌, అంగన్వాడీ యూనయన్‌ నాయకులు పద్మావతి, లక్ష్మీ దేవి, భాగ్యమ్మ, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. బత్తలపల్లి : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని సిఐటియు శ్రామిక మహిళ కన్వీనర్‌ దిల్షాద్‌ అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు 37రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. అంతకు ముందు బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలకు చెందిన అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిడిపిఒకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో వాసంతి, రజియా వసంత, కృష్ణవేణి, సున్నిబేగం, జయసుధ, అరుణ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. గుడిబండ : అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరుకుంది. అమరాపురం, గుడిబండ మండలాలకు చెందిన అంగన్వాడీలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుడిబండ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి మహాదేవమ్మ, ఆయా మండలాలకు చెందిన సెక్టార్‌ లీడర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. హిందూపురం : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని పట్టణంలోని సద్బావన్‌ సర్కిల్‌లో 37 రోజుల నుంచి నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా నాయకులు సాంబశివ బుధవారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు బదులుగా బుధవారం అంగనవాడీలంతా సమ్మె శిబిరం నుంచి పూలకుంట వద్ద ఉన్నా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారిణికి సమాధానంతో కూడిన నోటీసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కార్యదర్శి లావణ్య, ప్రాజెక్టు కోశాధికారి శిరీషా, నాయకులు శైలజ, నాగమ్మ, వరలక్ష్మి, పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️