మంటకలిసిన మానవత్వం

ఓబుళదేవరపల్లిలో గంగమ్మ ఇంటి వద్ద అంత్యక్రియలపై మాట్లాడుతున్న పోలీసులు

           సోమందేపల్లి : నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి చనిపోతే ఆమెకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుకులు కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ఇంటి ముందరే తల్లి మృతదేహం వద్ద బేరాళాడుకున్నారు. ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ అంత్యక్రియలు చేయకుండా తలోదిక్కు వెళ్లిపోయారు. చివరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని కుమారుల చేత బలవంతంగా అంత్యక్రియలను పూర్తి చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. సభ్యసమాజం సిగ్గుపడేలా మంటకలిసిపోతున్న మానవత్వంకు నిదర్శనంగా ఈ ఘటన నిలిచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమందేపల్లి మండలం ఓబులదేవరపల్లిలో గ్రామానికి చెందిన గంగమ్మ(60) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించింది. గతంలోనే ఈమె భర్త మరిణించాడు. అప్పటి నుంచి ఒంటిరిగానే ఆమె ఉంటోంది. ఈమెకు ముగ్గురు కుమారులున్నారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. గంగమ్మ మరణించడంతో స్థానికులు విషయాన్ని కుమారులకు తెలియజేశారు. అక్కడికి వచ్చిన కుమారులు తల్లి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని అంత్యక్రియల బాధ్యత నీదంటేనీదని ఒకరిపై ఒకరు వాదులాడుకున్నారు. గంగమ్మ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బు, ఆస్తి కోసం వాగ్వాదం చేసుకున్నారు. చివరకు ఎవరూ అంత్యక్రియలు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు, గ్రామస్తులు విషయం తెలుసుకుని కుమారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో విషయాన్ని పోలీసుల దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్‌ఐ విజరు కుమార్‌, విఅర్‌ఒ రాజశేఖర్‌, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ గ్రామంలోకి వెళ్లారు. వెంటనే కుమారులను అక్కడికి రప్పించి మాట్లాడారు. తల్లి అంత్యక్రియలను చేయాల్సిన బాధ్యత కుమారులదే అని, తక్షనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలను నిర్వహించారు.

➡️