విగ్రహాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

విగ్రహాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

విలేకరులతో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

       కదిరి అర్బన్‌ : ప్రశాంతంగా ఉన్న కదిరి ప్రాంతంలో కులం, మతం, విగ్రహాల పేరుతో విద్వేష రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ది చరిత్ర హీనుడిగా నిలిచిపోతారని టిడిపి కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటులో వైసిపి నాయకులు ప్రజల మధ్య కక్షలు రేపే కుట్రలు చేస్తున్నారన్నారు. భూస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడేతత్వం బలిజ సోదరులకు ఉంటుందన్నారు. వారు ఆరాధించే కుల బాంధవుడు శ్రీకష్ణదేవరాయల విగ్రహం కదిరి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారన్నారు. ఈ విషయంలో మంత్రి పెద్దిరెడ్డి ఒకలా, స్థానిక ఎమ్మెల్యే ఒకలా ప్రవర్తిస్తూ విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసే సమయంలో ఏ కారణం లేకుండా బలిజలపై క్రిమినల్‌ కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గం అన్నారు. తలుపులలో శ్రీకష్ణదేవరాయల విగ్రహం, కదిరిలో ఎన్టీఆర్‌, వేమారెడ్డి, నిజాంవళి, ఇందిరాగాంధీ, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినప్పుడు ఎలాంటి సమస్యలూ లేవన్నారు. అలాంటిది కదిరిలో శ్రీకష్ణదేవరాయల విగ్రహం పెట్టుకోవాలనుకుంటే బలిజలపై ఎందుకు కేసులు నమోదు చేశారో అర్థం కావడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కదిరి ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి కాని ఇలా కక్షలతో కూడిన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కుల, మత రాజకీయాలు చేసే సంస్కృతి కదిరి ప్రాంతంలో ఎప్పుడూ లేదని, మంత్రి పెద్దిరెడ్డి అలాంటి సంస్కృతిని తెచ్చే ప్రయత్నం చేస్తుండడం సరికాదన్నారు. ఇలాంటి పద్ధతులను ఆయన మానుకోకపోతే చరిత్రహీనుడిగా నిలిచిపోతారన్నారు. కదిరి ప్రాంతాన్ని భవిష్యత్తులో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ కింద పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎత్తైన శ్రీకష్ణదేవరాయల విగ్రహాన్ని కదిరి పట్టణంలో తాను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. రాజకీయ అవసరాలు, ఎత్తుగడలకు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

➡️