సమస్యలు పరిష్కరించేంతవరకూ సమ్మె

Jan 11,2024 21:50

ధర్మవరంలో సమ్మెలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లాకార్యదర్శి ఇంతియాజ్‌

             ధర్మవరం టౌన్‌ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రదానకార్యదర్శి శ్రీదేవి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్‌ కార్యాలయంఎదుట 31వ రోజు తమ సమ్మెను అంగన్వాడీలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ 31 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వారిపై కక్షసాధింపు చర్యలకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఇలాంటి బెదిరింపులకు బయపడేప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌ ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌. ఆదినారాయణ, అయూబ్‌ఖాన్‌, అధికసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. గాండ్లపెంట : మండల కేంద్రంలో అంగన్వాడీలు 31 రోజు సమ్మె కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల యూనియన్‌ అధ్యక్షురాలు లక్ష్మీదేవి, భారతి, సుజాతతో పాటు అధికసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. నల్లచెరువు : మండలంలోని అంగన్వాడీలు 31వ రోజు సమ్మె కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కౌన్సిల్‌ సభ్యులు శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రమేష్‌తో పాటు అధికసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. పరిగి : తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు గురువారం వినూత్న రీతిలో నిరసన చేశారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జడ్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మోకాళ్ళపై కూర్చొని నిరసన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల కనీస డిమాండ్లు పరిష్కరిస్తామని ముందుకు వచ్చిన పాపన పోలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ నాయకురాలు పద్మతో పాటు అంగన్వాడీలు పాల్గొన్నారు. బత్తలపల్లి : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదాకా సమ్మెను విరమించేది లేదని సిఐటియు జిల్లా నాయకులు శ్రీదేవి, జిల్లా శ్రామిక మహిళ అధ్యక్షురాలు దిల్షాద్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పందించి వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీర్చాలని లేకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ప్రాజెక్టు కార్యదర్శి చంద్రకళ, హిందూపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు శోభ, బత్తలపల్లి ప్రాజెక్టు లీడర్లు వాసంతి, లీడర్స్‌ రంజిత, వసంతం జయసుధ, పుష్పలత, శివమ్మ ,సుగుణ, క్రిష్టవేణి జయసుధ, సున్నీబేగం, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవర చెరువు : అంగన్వాడీ సెంటర్లు మూసి ఉంటే సెంటర్లను తెరిచామని చెప్పడం సబబు కాదుఉద్యమాన్ని నీరుగార్చ ప్రయత్నాలు మానుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, అంగన్వాడి యూనియన్‌ నాయకు రాళ్లు రంగమ్మ ఆశీర్వాదమ్మ అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 31 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నామన్నారు. అయితే మండల పరిధిలోని బాబాసాహెబ్‌ పల్లి లో ఉన్న అంగన్వాడీ సెంటర్‌ ను తెరిచామని, అంగన్వాడీలు విధులకు హాజరు అయ్యారని అపద్దాలు చెబుతూ తమ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం పోరాటం ఆపే ప్రసక్తి లేదన్నారు. ముదిగుబ్బ : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం కొనసాగింది. ఈసందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని ఖండిస్తునానమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న, సిఐటియు నాయకులు మధు, వెంకటేశు, బాబు, పోతలయ్య, అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు రజియాతో పాటు పెద్దసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌: పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు అంగన్వాడీల సమ్మె 31వ రోజు గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 31వ రోజు ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, అంగన్వాడీలతో పాటు సిఐటియు నాయకులు బాళ్ల అంజి తదితరులు పాల్గొన్నారు. కదిరి అర్బన్‌ : పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద సిఐటియు యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరవరధిక సమ్మెను కొనసాగించారు. జనసేన పార్టీ తరపున కదిరి ఇన్‌చార్జి భైరవ ప్రసాద్‌, బ్లూమూన్‌ శివశంకర్‌ అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయని ప్రభుత్వం వారిని రోడ్డుమీదకి లాగిందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, నల్లచెరువు మండల కన్వీనర్‌ రవికుమార్‌, చిన్నపరెడ్డి, కిన్నెర మహేష్‌, హరిబాబు, ప్రతాప్‌, రాజ్‌ కుమార్‌, గంగరాజు, రామ్మోహన్‌, నాగరాజు, రామచంద్ర, రఘు, ఐనొద్దిన్‌, రవి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం :అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 31వ రోజు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా, విధుల నుంచి తొలగిస్తామని షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన తమ ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. సమ్మెలో భాగంగా 31 వ సంఖ్య ఆకారంలో అంగన్వాడీలంతా కూర్చొని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. అనంతరం సమ్మె శిబిరంలో ముఖ్యమంత్రి జగన్‌ చిత్ర పటం ముందు సెల్‌ఫోన్‌లు, ఏకరూప చీరలను పెట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, యూనియన్‌ నాయకులు శైలజ, శిరీషా, నాగమ్మ, సాహేరా, వరలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. పెనుకొండ : పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు మట్టి తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రోజూ ఇలానే మట్టి తింటూ నిరసన తెలుపుతామన్నారు. మంత్రి ఉషశ్రీచరణ్‌ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని, మా ఇంటికి ప్రచారానికి వస్తే ఆమెకు చీర, పసుపు, కుంకుమ ఇచ్చి తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.లేపాక్షి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం బాధాకరం అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహప్ప, భాగ్యమ్మ, రూప, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️