సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

పెనుకొండలో జరిగిన ‘రా కదలిరా’ సభలో మాట్లాడుతున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

         అనంతపురం ప్రతినిధి, పెనుకొండ : టిడిపి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలోని పేరూరు, బిటిపి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నారా చంద్రబాబు నాయడు హామీనిచ్చారు. టిడిపి చేపట్టిన ‘రా కదలరా’ కార్యక్రమం మగింపు సభ పెనుకొండలో సోమవారం జరిగింది. కియా పరిశ్రమ ఎదుట ఏర్పాటు చేసిన ఈ సభకు అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి వేలాదిగి టిడిపి, జనసేన కార్యకర్తలు, నాయకులు తరలొచ్చారు. ఈ సభలో చంద్రబాబునాయుడు వైసిపిపై విమర్శలు గుప్పిస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్న దానిపైనా హామీలిచ్చారు. పేరూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామని, బిటిపికి నీటిని అందిస్తామని హామీనిచ్చారు. అదే విధంగా డ్రిప్‌, స్ప్రింక్లర్లకు సబ్సిడీని 90 శాతంతో మునుపటిలాగా ఇస్తామని హామీనిచ్చారు. రైతులకు సోలార్‌ పంపుసెట్లు అందజేసి విద్యుత్‌కు ఖర్చు లేకుండా చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతాలో సాగునీటికి ప్రాధాన్యతనిచ్చింది టిడిపినే అని చెప్పారు. గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసామని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈప్రాజెక్టులను విస్మరించారన్నారు. ఇటీవల రాప్తాడు జరిగిన సిద్ధం సభలోనైనా ఈ ప్రాంతానికి ఏమి చేశానన్నది వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చెప్పాలేదని విమర్శించారు. టిడిపి అధికారంలోనున్న ఐదేళ్లలో సాగునీటి కోసం రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. భవిష్యత్తులోనూ సంక్షేమంలో కోతల్లేకుండా ప్రజలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉపాధి కోసం బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళితే వెంటనే పింఛన్లు తొలగిస్తున్నారని, అలాకాకుండా మూడు మాసాలైనా తొలగించకుండా ఇస్తామని హామీనిచ్చారు. సత్యసాయి జిల్లాలో వైసిపి ఎమ్మెల్యేల అక్రమాలు అన్నీఇన్నీ కావని ఒక్కో ఎమ్మెల్యే గురించి చంద్రబాబు వివరించారు. వీరు పెద్దఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. కొంత మందిని వేరే ప్రాంతాలకు బదిలీలు చేసారని తెలిపారు. నియోజకవర్గం మారితే ఇక్కడ చెత్తగానున్నది అక్కడ స్వర్ణమవుతుందా అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నిల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ టిడిపి గెలిపించాలని, అందుకోసం ఈ నలభై రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రంలో ఆర్థికంగా ఎంతో దెబ్బతిందన్నారు. ఉద్యోగులకు వేతనాలు రావాలన్న అప్పులు పుట్టాల్సిందేనని అన్నారు. సంక్షేమ రాజ్యాం టిడిపితోనే సాధ్యమని చెప్పారు. సిద్ధం అని చెబుతున్న ముఖ్యమంత్రి దేనికి సిద్దమో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు పిఆర్‌సి ఇస్తామని ఇవ్వకుండా ఉన్నందుకు సమాధానం చెప్పడానికి సిద్ధమా… బాబారు హత్య కేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నారో చెప్పడానికి సిద్ధమా… దళిత వ్యక్తిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా… తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని హత్య చేసిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా..! అంటూ బాలకృష్ణ ప్రశ్నలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు సంసిద్ధులవ్వాలని పిలుపునిచ్చారు.

వైసిపి ఎమ్మెల్యేలపై బాబు ఫైర్‌

          రా..కదిలి రా సభ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోక్క వైసిపి ఎమ్మెల్యే పేరు చెబుతూ వారి అవినతి, అక్రమాలను ఎండగట్టారు. పెనుకొండ శంకర్‌ నారాయణ పెద్ద ఎత్తున అవినీతి చేశాడన్నారు. రాప్తాడులో తోపుదుర్తి అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అక్కడ లేఅవుట్‌ వేయాలన్నా కప్పం కట్టాల్సిందే అన్నారు. రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిని సంస్కృతి తోపుదుర్తిది అన్నారు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి లక్ష్మీ నరసింహ స్వామిని కూడా వదల్లేదన్నారు. ఇలా ఒక్కో ఎమ్మెల్యే గురించి చంద్రబాబు చెబుతూ వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ, శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లాల టీడీపీ ఎన్నికల పరిశీలకులు కోవెల మూడి రవీంద్ర, పెనుకొండ నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్‌ నరసింహ రావు, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘు నాథ్‌ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మినారాయణ, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి, జనసేన నాయకులు టీసీ.వరుణ్‌, చిలకం మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️