స్కాం బయటకు వస్తుందనే లేపాక్షికి సిఎం డుమ్మా : కాంగ్రెస్‌

Jan 16,2024 22:06

 నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు  

                    హిందూపురం : లేపాక్షి భూముల స్కాం బయటకు వస్తుందనే కారణంతోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి లేపాక్షికి రాలేదని పిసిసి జనరల్‌ సెక్రటరీ బాలాజీ మనోహర్‌ ఆరోపించారు. ప్రధాని మంగళవారం లేపాక్షికి వస్తున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు హిందూపురం నుండి లేపాక్షికి వెళ్లి విభజన హామీలు, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిని ఇవ్వాలని బయలుదేరారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరూన్‌ భాష తన సిబ్బందితో వచ్చి వారిని అరెస్టు చేసి వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా బాలాజీ మనోహర్‌ మాట్లాడుతు అన్ని విధాలా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రకు రావడానికి సిగ్గు అనిపించలేదా అని అన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో బిజెపి మద్దతు తెలిపిందన్నారు. ఆ సమయంలో ఆంధ్రకు ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, ఆంధ్రకు రైల్వే జోన్‌, కేంద్ర విద్యాసంస్థలు మంజూరుకు ఆమోదం తెలిపిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో రాయలసీమలోని తిరుపతి వెంకన్న సాక్షిగా 2014లో ఆధికారంలోకి వచ్చిన వెంటనే విభజన చట్ట హామీలతో పాటు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే 10 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఇచ్చిన హామీలను నేరవేర్చలేదన్నారు. విభజన బిల్లు హామీలను అమలు చేయకుండా ఏపీని గాలికి వదిలేసి, ఎన్నికల ముందు హిందూపురం ప్రాంతానికి రావడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీపై వినతిని ఇవ్వడానికి వెళుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఇక పోతే హిందూపురం నియోజక వర్గంలోని లేపాక్షి భూముల స్కాం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లేపాక్షి రాలేదని ఆరోపించారు. సిఎం జగన్‌ హిందూపురం ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, వైసిపిలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. అరెస్టు చేసిన నాయకులను సొంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమీల్‌, ఫయాజ్‌, మహబూబ్‌ బాషా, తిరుపాల్‌, ఆయాజ్‌, రామాంజినేయులు, లేపాక్షి మండల ప్రెసిడెంట్‌ సద్రుల్లా, లేపాక్షి మండల ప్రెసిడెంట్‌ గంగాధరప్ప, బీసీ సెల్‌ అధ్యక్షులు సంజీవప్ప, ఎస్సీ సెల్‌ ఎరిస్వామి, రైతు సంఘం అధ్యక్షులు బాబు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ముబారక్‌, చిలమత్తూరు నాయకులు నరసింహప్ప, అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️