హక్కుల సాధనే లక్ష్యం కావాలి

Mar 11,2024 21:43

సమావేశంలో మాట్లాడుతున్న శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌

                         హిందూపురం :మహిళలు తమ హక్కుల సాధనే లక్ష్యం గా ముందుకు సాగాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని వాసవి ధర్మశాలలో సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌, ప్రముఖ గైనకాలిస్టు నాగ సింధు, మహిళా నాయకురాలు రజని, ఆశా సెక్రెటరీ మమత, దివ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వేణుగోపాల్‌ రావు, కెవిపిఎస్‌ నాయకురాలు జ్యోతి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్‌ పి శ్రీనివాసులు, సాంబ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సమాజంలో నేటికీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది మహిళలు ప్రపంచ వ్యాప్తంగా సమానత్వం కోసం తమ గొంతులను వినిపిస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల చిన్నచూపుతూనే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల కోసం పోరాటాలను సాగించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ఆటల పోటీలను నిర్వహించారు. పాల్గొన్న వారికి దివ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వేణుగోపాల్‌ రావు నగదు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ రంగం మహేశ్వరి, సిఐటియు నాయకులు రాజప్ప, జగదీష్‌, రాము, రామకృష్ణ తో పాటు శిరీషా, అంగన్‌ వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌ : మహిళా సాధికారతే సమాజ ప్రగతికి దోహదపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిఆర్‌డిఎ కార్యాలయంలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో భాగ్యరేఖ, సిరికల్చర్‌ జాయింట్‌ సెక్రెటరీ పద్మమ్మ, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి మాట్లాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతూ ఎన్నో విజయాలను సాధిస్తూ సమాజాభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. తమ పిల్లలను బాగా చదివించి ఉన్నతమైన స్థాయికి తీసుకురావడంలో మహిళ పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలపోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసయ్యతో పాటు 32 మండలాల నుండి మండల సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు ,కోశాధికారులు, డిఆర్‌డిఎ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️