Water Crisis : భవిష్యత్తులో భారత్‌ను వెంటాడనున్న నీటి సంక్షోభం : మూడీస్‌

Jun 26,2024 15:19 #water crisis

న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు ఆ రాష్ట్రాన్ని నీటి సంక్షోభం వెంటాడుతుంది. దీంతో ఢిల్లీవాసులకు తాగేందుకు నీరులేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే గతంలో కర్ణాటక కూడా తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంది. దేశంలో ఈ రెండు రాష్ట్రాలే నీటి సమస్యల్ని ఎదుర్కొన్నాయనుకుంటే పొరపాటే. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో భారత్‌ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుందని తాజాగా మూడీస్‌ రేటింగ్‌ కంపెనీ హెచ్చరించింది. భారత్‌లో రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో జలసంక్షోభం పెరగనుంది. దీనివల్ల వినియోగంలో పెరుగుదల, ఆర్థికాభివృద్ధిలోనూ, దేశీయ రుణాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మూడీస్‌ హెచ్చరించింది. ముఖ్యంగా నీటి సంక్షోభం వల్ల కంపెనీలు, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశముంది. దాని ఫలితంగా ఆహార ధరలు పెరుగుతాయి. వ్యాపార రంగం దెబ్బతింటుంది. మొత్తంగా జలసంక్షోభం వల్ల సమాజంలోనే అశాంతి నెలకొనే ప్రమాదం పొంచి ఉందని మూడీస్‌ సంస్థ పేర్కొంది.
భారత్‌లో 40 శాతం కంటే ఎక్కువమందే వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. నీటి సంక్షోభం వల్ల వీరందరిపైనా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. అదేవిధంగా దేశ వృద్ధిలోనూ ఈ సంక్షోభం అస్థిరతను పెంచుతుందని మూడీస్‌ పేర్కొంది. నీటి ఎద్దడివల్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కంపెనీలు, ఉక్కు కంపెనీలు భవిష్యత్తులో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోనున్నాయని, పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉందని మూడీస్‌ కంపెనీ పేర్కొంది.
నీటి నిర్వహణలో జి 20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ చాలా వెనుకబడి ఉందని, ఈ సందర్భంగా మూడీస్‌ గుర్తు చేసింది. భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా, పారిశ్రామికీకరణ, పట్టణీకరణలోనూ, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచినప్పటికీ అవసరాలకుగుణంగా నీటిలభ్యత లేదు. ఇప్పటికే తలసరి సగటు వార్షిక నీటి లభ్యత తక్కువగా ఉంది. 2021లో తలసరి సగటు వార్షిక నీటి లభ్యత 1,486 క్యూబిక్‌ మీటర్లుగా ఉంది. ఇది 2031 నాటికి 1,367 క్యూబిక్‌ మీటర్లకు పడిపోవచ్చని మూడీస్‌ అంచనా వేసింది. నీటి వనరుల మంత్రిత్వశాఖ ప్రకారం.. 1,700 క్యూబిక్‌ మీటర్ల కంటే తక్కువస్థాయి నీటి లభ్యత ఉంటే నీటి ఎద్దడిని సూచిస్తుంది. అదే 1,000 క్యూబిక్‌ మీటర్లుగా ఉంటే నీటి కొరతను సూచిస్తుంది.
భారత్‌లో పర్యావరణ మార్పుల వల్ల ఢిల్లీతోపాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయి. ఇలా అకస్మాత్తుగా వర్షాలు కురిసినా.. వర్షపు నీటిని నిలుపుకోవడానికి సరిపోదు. దీంతో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందులేర్పడతాయని మూడీస్‌ సంస్థ పేర్కొంది.
రుతుపవనాల వర్షపాతం కూడా క్రమేపీ తగ్గుతోందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ (ఐఐటిఎం) తెలిపింది. 1950-2020 సమయంలో హిందూ మహాసముద్రం శతాబ్దానికి 1.20 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున వేడెక్కింది. 2020-2100 మధ్య కాలంలో 1.7-3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఐఐటిఎం తెలిపింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బలహీననమైన రుతపవన వర్షపాతం సాధారణంగా మారుతుంది. దీనివల్ల వర్షాలు లేక తరచుగా కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఐఐటిఎం పేర్కొంది.

➡️