26 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడాపోటీలు

Dec 20,2023 22:26

విడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌, తదితరులు

                    పుట్టపర్తి అర్బన్‌ : ఈనెల 26 నుంచి జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. అధికారులు అందరూ బాధ్యతగా పనిచేసి ఈ క్రీడాపోటీలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ తో పాటు జిల్లా క్రీడా సాధికారత అధికారి ఉదయ భాస్కర్‌, గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్‌ శివారెడ్డి, డిపిఒ విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో జరిగిన రిజిస్ట్రేషన్‌ నమోదు కార్యక్రమం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రీడల పట్ల అవగాహన ఉండాలని క్రీడలలో మహిళా క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రీడా పోటీలలో కబడ్డీ, ఖోఖో, షటిల్‌, వాలీబాల్‌, క్రికెట్‌ లాంటి ఐదు అంశాలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం వస్తుందని తద్వారా ఆరోగ్యం బాగుంటుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని 544 గ్రామ వార్డు సచివాలయాలలో సుమారు 1. 50 లక్షల మంది పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించాలన్నారు. జిల్లాలో 502 క్రీడ మైదానాలను గుర్తించడం జరిగిందన్నారు. 540 మంది వాలంటీర్లకు ఈ క్రీడలలో శిక్షణ తర్ఫీదు ఇచ్చామని వివరించారు. నియోజకవర్గ స్థాయిలోని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు పాల్గొనాలన్నారు. 26వ తేదీ నాటికి క్రీడా మైదానాలలో పూర్తిస్థాయిలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️