అమాత్యా.. పెండింగ్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కించేరా..?

Jun 16,2024 21:49

అధ్వానంగా ఉన్న హెచ్‌ఎల్‌సి

                     అనంతపురం ప్రతినిధి : ఆర్థిక శాఖ మంత్రి అయ్యాక పయ్యావుల కేశవ్‌ తొలిసారిగా జిల్లాకు రానున్నారు. సోమవారం ఆయన రాక కోసం తెలుగుదేశం శ్రేణులు, ఆయన అభిమానులు పెద్దఎత్తునే స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. చాలాకాలం తరువాత ఆయనకు ఈ కీలకమైన మంత్రి పదవి దక్కింది. అది కూడా ఆర్థిక శాఖయే కావడంతో జిల్లా అభివృద్ధి ఏ రకంగా పరుగులు పెట్టించగలరన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జిల్లా సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఆయనకుంది. దీంతో ప్రధానంగా నిత్యం కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాకు సాగునీటి వనరులపై దృష్టి సారిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఐదేళ్లుగా ప్రాజెక్టులన్నీ పెండింగులో ఉన్నాయి. ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోనే పెండింగులో ఉండటం గమనార్హం. హంద్రీనీవా మొదటి దశ కింద ఆయకట్టుకు నీటిని అందించేందుకు వీలున్నది ఉరవకొండ నియోజకవర్గంలోనే. 2012వ సంవత్సరం నుంచి హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరొస్తున్నా ఆయకట్టుకు నీటిని అందించే పంట కాలువల నిర్మాణం పనులు పూర్తవలేదు. అవి పెండింగులో ఉంటూ వస్తున్నాయి. దీంతో నీరు కళ్లముందు పోతున్నా ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులకు మాత్రం ఆయకట్టుకు నీరందటం లేదు. ఇక రూ.850 కోట్లతో చేపట్టిన సామూహిక బిందు, తుంపెర సేద్యం ప్రాజెక్టు అటకెక్కి ఐదేళ్లవుతోంది. టెండర్ల పున:పరిశీలనలోనే కాలమంతా గడిచిపోయింది. ఇది పూర్తయింటే సుమారు 50 వేల ఎకరాలకు సామూహిక బిందు, తుంపెర సేద్యం ద్వారా నీటిని అందించే వీలుండేది. ఇకపోతే జిల్లాలో భైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరు ఎత్తిపోతల పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. భూసేకరణ ఇప్పటికీ పూర్తవలేదు. దీంతోపాటు జిల్లాకు ప్రధానంగా సాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది.తుంగభద్ర డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేసిన ప్రతీసారి ఎక్కడో ఒకచోట గండిపడటం నీరు వృధాగా పోవడం జరుగుతూనే ఉంటోంది. దీని ఆధునీకరణ పూర్తి చేయాల్సి ఉంది. పిఎబిఆర్‌ డ్యామ్‌ లీకేజీలతో పూర్తి స్థాయి సామర్థ్యంతో నింపలేని పరిస్థితి ఉంది. జీయోమెమ్రైన్‌ పద్దతులలో మరమ్మతులు చేపడితే పూర్తి స్థాయి సామర్థ్యంతో నింపే వీలుంటుంది. దీంతోపాటు జిల్లాలో పరిశ్రమలేవి లేవు. కియా పరిశ్రమ గత టిడిపి ప్రభుత్వ హయాంలో వచ్చింది. అది సత్యసాయి జిల్లాలో ఉంది. అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రాంతంలో మినహా ఎక్కడా పెద్ద పరిశ్రమలన్నవి లేవు. అపారమైన ఖనిజ సంపద ఇక్కడున్నా వాటి ఆధారిత పరిశ్రమలు రావడం లేదు. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్‌ ఈ ప్రధానమైన సమస్యలకు పరిష్కారాలను ఏ మేరకు తీసుకురాగలరోనని జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ కీలకమైన శాఖకు ఆయన మంత్రిగా ఉండటంతో ఆయన మార్కు జిల్లాలో చూపే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నారు.

➡️