అంతటా ఉత్కంఠ..!

      అనంతపురం : ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా జరిగింది. ప్రధానంగా టిడిపి, వైసిపిలు నువ్వానేనా అన్నట్లు ప్రచారలు కొనసాగించారు. అదే ఊపుతో సర్వశక్తులూ ఒడ్డి పోలింగ్‌కు కష్టపడ్డారు. పోలింగ్‌ ముగిసన నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎలా ఉందన్న దానిపై అందరూ దృష్టి సారించారు. ముఖ్యంగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాలు, వార్డుల వారీగా లెక్కలు తీస్తున్నారు. అనుకున్న దాని కంటే పోలింగ్‌ శాతం పెరగడం అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తోంది. పెరిగిన ఓటింగ్‌ శాతం దేనికి సంకేతం అన్న భావనలో అభ్యర్థులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి రెండు రోజులు అయ్యింది. పోలింగ్‌ అయితే ముగిసింది కానీ, గెలుపు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. విజేత ఎవరన్నది తేలాలంటే జూన్‌ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు, ముఖ్య నాయకులు వారి సొంత సమీకరణలో ముందుకు వెళ్తున్నారు. ఏఏ కేంద్రాల్లో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు వేస్తున్నారు. గెలుపు ఓటములపై ఆయా గ్రామాలు, వార్డుల ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. టిడిపి, వైసిపి మధ్య ప్రధాన పోటీ జరిగిందని తేలడంతో ఫలితంపై ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఆయా పార్టీల మద్దతుదారులు సైతం ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠగా ఉన్నారు. ఎవరికి వారు ఆయా కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ దసారి ప్రజలు ఓటువేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. ఆయా పార్టీలు ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి వారి ప్రసంగాల్లో పెద్ద ఎత్తునే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆహామీల అమలు కోసం ఓటర్లు రాత్రి వరకు క్యూలైన్‌లో నిల్చొని ఓట్లు వేశారా..? లేక ప్రభుత్వంపై వ్యతిరేకతా..? లేక అనుకూలతా..? అన్న విషయంపై నాయకులు అంచనాలు వేస్తున్నారు. టిడిపి, వైసిపి రెండు పార్టీలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తాము భారీ మెజార్టీతో గెలువబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే ఫలితాలపై బెట్టింగ్‌లు సైతం వేశారు. ఇలాంటి వారు పోలింగ్‌ సరళిపై మరింత ఎక్కువగా దృష్టి సారించి లెక్కలు వేస్తున్నారు.

20 రోజులు వేచి ఉండాలా..?

        కౌంటింగ్‌కు ఇంకా 20 రోజుల సమయం ఉండడం చాలా మంది సహనానికి పరీక్షగా ఉంది. అన్ని రోజులు ఎలా వేచి ఉండాలంటూ సతమతం అవుతున్నారు. అభ్యర్థుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో కౌంటింగ్‌కు పోలింగ్‌కు 40 రోజుల సమయం ఉండేదని, అంత సమయాన్నే గడిపామని ఇప్పుడు 20 రోజు ఏమంత పెద్ద లెక్కకాదంటున్నారు. ఎలాగో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఖాళీ సమయం దొరకడంతో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.

➡️