కదిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తా : ఎమ్మెల్యే

Jun 16,2024 21:47

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

                  కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఆదివారం పట్టణ సమీపంలోని పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే కందికుంట ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు 20వేల మంది దాకా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కందికుంట వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఉద్యోగ పారిశ్రామికపరంగా మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. అధికారమంటే చెలాయింపు కాదని ప్రజలు ఇచ్చిన అవకాశమని అన్నారు. ప్రజలకు మంచి చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని భవిష్యత్తులో వారు మనల్ని ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. కదిరిలో మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలను శాసించాలని చూసిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా అని అన్నారు. తన ముందు అనేక కర్తవ్యాలు ఉన్నాయని వాటిని నెరవేర్చ బాధ్యత ప్రజలు తనకి ఇచ్చారని వాటన్నిటిని నెరవేర్చి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, పిసి భైరవ ప్రసాద్‌, మంచి శివశంకర్‌, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి టీవీ పవన్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌, మాజీ మహిళా కమిషన్‌ సభ్యురాలు పర్వీన్‌ భాను, కౌన్సిలర్లు, టిడిపి మండల కన్వీనర్లు, చెన్నకేశవులు, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️