May 26,2024 08:50

మేలో వర్షాలు మెండు..!

అనంతపురం ప్రతినిధి : సాధారణంగా మే నెలలో మండే ఎండలు అని అనుకుంటాం. మే మొదటి వారం వరకు కూడా అదే వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. మే మొదటి వారంలో 43 డిగ్రీల వరకు ఎండలుండేవి. రెండవ వారం నుంచి ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు వర్షాలు పడుతుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. మూడవ వారంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో వర్షాలు మెండుగా వచ్చాయి. సాధారణం కంటే 300 శాతం అధికంగా వర్షపాతం నమోదవడం గమనార్హం. గతేడాది ఇదే నెలలో 74.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా ఈసారి ఇప్పటి వరకు 103.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. మేలలో సాధారణ వర్షపాతం చూస్తే 25.8 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే మే నెలలో సాధారణ వర్షపాతం కంటే 300 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది.

సీజన్‌ ముగింపులో వర్షాలు

           2023-24 సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకుని ఉంటూ వచ్చాయి. జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతి నెలా వర్షభావ పరిస్థితులే జిల్లాలో నెలకుని ఉండేవి. జూన్‌ నుంచి మే వరకు సాధారణ వర్షపాతం 501.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 397.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. అందులో మే నెలలోనే 104.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. మేలో వర్షాలు లేకపోతే జిల్లాలో ఇప్పటి వరకు 293.3 మిల్లీమీటర్లు మాత్రమే పడి ఉండేది. ఎప్పుడూలేని విధంగా ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు పడ్డాయి. ఇక మండలాల వారీగా చూస్తే శెట్లూరు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. శెట్టూరు మండలంలో సాధారణ వర్షపాతం 26.1 మిల్లీమీటర్లు అయితే 171.9 మిల్లీమీటర్లు నమోదయింది. సాధారణం కంటే 551 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది. ఆ తరువాత కుందుర్పి మండలంలో 27.3 మిల్లీమీటర్లు సాధరణ వర్షపాతమయితే 140.9 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. ఉరవకొండలో గరిష్టంగా 601.7 శాతం వర్షపాతం అధికంగా నమోదయింది. అక్కడ సాధారణ వర్షపాతం 29.4 మిల్లీమీటర్లు అయితే పడిన వర్షం 206.3 మిల్లీమీటర్లు ఇలా జిల్లాలో అన్ని మండలాల్లోనే మే నెలలో అధిక వర్షపాతమే నమోదయింది.

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

           ఈనెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. సగటున 22 మిల్లీమీటర్లు వర్షపాతం శనివారం నాడు నమోదయింది. కళ్యాణదుర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీమీటర్లు పడింది. కణేకల్‌లో 70 మిల్లీమీటర్లు నమోదవగా, ఉరవకొండలో 62 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. కుందుర్పిలో 58.6మిల్లీమీటర్లు, వజ్రకరూరులో 46.2 మిల్లీమీటర్లు నమోదయింది. యల్లనూరు, నార్పల మినహా తక్కిన అన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షపాతం శనివారం నాడు నమోదయింది.

➡️