Apr 6,2024 08:33

ముదిగుబ్బలో వైసిపికి దెబ్బ… పార్టీ వీడనున్న ముఖ్య బిసి నేత..?

            ముదిగుబ్బ : ఎన్నికల వేళ ధర్మవరం వైసిపికి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు తెలుస్తోంది. ముదిగుబ్బకు చెందిన ఓ వైసిపి నేత పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సదరు బిసి నేత పార్టీ వీడే విషయంపై నిర్ణయం తీసకున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి ప్రజా ప్రతినిధిగా, వైసిపి నాయకునిగా ఈయనకు మండలంలో గుర్తింపు ఉంది. వివాద రహితునిగా ఉన్న ఈయనకు వైసిపి ముఖ్యనేతలు అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఈయనకు గుర్తింపు ఉంది. రాజకీయ అనుభవం లేకున్నా మొదటి ప్రయత్నంలోనే ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక అయ్యారు. వైసిపి నియోజకవర్గ ముఖ్య నాయకుడు, మండల స్థాయి నాయకులు చేస్తున్న విధానాలపై ఆయన గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సైతం సదురు నేత దూరం పాటిస్తున్నారు. పార్టీలో రోజురోజుకూ మారుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ఇమడలేక బయటికి వెళ్లిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన మద్దతుదారుల వద్ద ఇటీవల తెలియజేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు వైసిపిని వీడితే మండలంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

➡️