పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

May 3,2024 21:50

విడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌, తదితరులు

                     పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్‌ బాబు తెలిపారు. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్‌ సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ జిల్లా ఎన్నికల అధికారులతో న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికలపై సమీక్షించారు. నాలుగవ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు నోడల్‌ అధికారులు వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు అన్బుకుమార్‌, దీపక్‌ రామచంద్ర తివారి, పోలీస్‌ పరిశీలకులు అమిత్‌ కుమార్‌, వినాయక్‌, ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ మాట్లాడుతూ రీపోలింగ్‌కు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు.కట్టుదిట్టంగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు పర్యవేక్షణ ఉండాలన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు స్లిప్పులను బిఎల్‌ఒల ద్వారా సంబంధిత ఓటర్లకు పంపిణీ చేయాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాలు సమస్యత్మక గ్రామాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️