తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Mar 4,2024 20:02 #Battalapally, #Clash, #TDP, #tension
  • మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. పరిటాల శ్రీరామ్‌ గ్రూపుల మధ్య ఘర్షణ
  • 25 వాహనాలు ధ్వంసం

ప్రజాశక్తి-బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పెనుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభకు వెళ్తుండగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ మద్దతుదారులు ఎదురెదురుగా తలపడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.దాదాపు 25 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకర్గం కేంద్రం సమీపంలోని ‘కియా’ వద్ద రా..కదిలి రా కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గనేందుకు ధర్మవరం నియోజకర్గం నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభిమానులు బయళ్దేరారు. బత్తలపల్లి టిడిపి కార్యాలయం వద్దకు సూర్యనారాయణ మద్దతుదారుల వాహనాలు రాగానే శ్రీరామ్‌ మద్దతుదారులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో సూర్యనారాయణ మద్దతుదారులకు చెందిన 20 వాహనాలు, శ్రీరామ్‌ మద్దతుదారులకు చెందిన ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరుగ్రూపులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో సమస్య సర్ధుమణిగింది.

➡️