ప్రచార వేడి..!

అనంతపురం కలెక్టరేట్‌ : ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలు ఉండడంతో ప్రచారాల కోసం అభ్యర్థులు, నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుతీసి బయట పెట్టాలంటే భయంకరమైన ఎండలు భయపెడుతున్నాయి. అయినా ప్రచారాలు చేయక తప్పని పరిస్థితులు. ఎండ వేడిమిని తట్టుకుని ప్రచార వేడిలో అభ్యర్థులు ముందుకు సాగక తప్పడం లేదు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది పోలింగ్‌ మాత్రమే. మే 13వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇందుకు సంబంధించి సమయం చాలా తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. భానుడి ఉగ్ర రూపాన్ని భరించలేక చాలా మంది తమ ప్రచారాలను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఎన్నికల వేడి, మరోవైపు భానుడి వేడితో ఉమ్మడి జిల్లా హోరెత్తుతోంది. పోలింగ్‌ సమయం దగ్గర పడడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు ప్రచారాలను జోరుగా చేస్తున్నారు. భానుడి ఉగ్రరూపంతో అనుకున్న స్థాయిలో కార్యకర్తలు వీరి ప్రచారంలో కలిసి రావడం లేదు. వస్తున్న వారు కూడా ఎండవేడిమిని తట్టుకోలేక మధ్యలోనే ప్రచారం నుంచి ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి కాంగ్రెస్‌ వేదిక అభ్యర్థులు ప్రచారాలతో జనం వద్దకు వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా ఎండ వేడిమితో పాటు వడగాలులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండలో ప్రచారం చేయడం అభ్యర్థులకు కొత్తకష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మండుతున్న ఎండల బారి నుంచి తప్పించుకుని ప్రచారం చేయడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం 6 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి వరకు ప్రచారం చేసుకునేలా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

పోటాపోటీగా ప్రచారాలు

     ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు ఉండడంతో అభ్యర్థులు ప్రచారాలను పోటాపోటీగానే నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి భయపడి ప్రచారంలో వెనుకబడితే ప్రత్యర్థి పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులు ప్రచారాన్ని ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువగా రోడ్‌షోలు నిర్వహించి ప్రచారాలు చేసేవారు. ప్రస్తుతం మండుతున్న ఎండలకు జనం రోడ్‌షోల వద్దకు వచ్చి నాయకుల ప్రసంగాన్ని వినే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో అభ్యర్థులే ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం చేయడం ద్వారా అభ్యర్థి స్వయంగా ఓటరును కలిసి ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఓటరును మాట్లాడించి ఓటును ఖచ్చితంగా వేయించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్న భావన అభ్యర్థులు కన్పిస్తోంది. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ వేదిక అభ్యర్థులు అందరూ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం

           మండుతున్న ఎండల నేపథ్యంలో అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను కూడా ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి అభ్యర్థి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కొందరని వారి వద్ద ఉంచుకుని వారి చేసే ప్రచారాలు, ఎన్నికల మ్యానిఫెస్టో తదితర వాటిని అభ్యర్థుల సెల్‌ఫోన్లకు పంపుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగించుకుని ఆయా గ్రామాలు, వార్డుల్లో గ్రూపుల్లో వేస్తున్నారు. ప్రతి అభ్యర్థి వద్ద ఇందుకోసం ఓ ప్రత్యేక సోషల్‌ మీడియా బృందం ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ సందేశాల ద్వారా ఓటును అభ్యర్థిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎండ వేడిమి నేపథ్యంలో అభ్యర్థులు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

➡️