అటవీ హక్కుల చట్టం పకడ్బందీగా అమలు

గిరిజన సంక్షేమానికి అంకితభావంతో

మాట్లాడుతున్న ఎస్‌టి కమిషన్‌ సభ్యులు అనంత నాయక్‌

  • జాతీయ ఎస్‌టి కమిషన్‌ సభ్యులు అనంత నాయక్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, మెళియాపుట్టి

గిరిజన సంక్షేమానికి అంకితభావంతో పనిచేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జాతీయ ఎస్‌టి కమిషన్‌ సభ్యులు అనంత నాయక్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షించారు. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గిరిజనులే అడవికి హక్కుదారులనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు, చట్టాలు, పాలసీల ద్వారా కల్పించిన హక్కులపై గిరిజనులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది తెలుసుకుని త్వరితగతిని వారికి న్యాయం చేయాలన్నారు. జిల్లాలో భూమి లేని ఎస్‌టి వ్యవసాయ కూలీల వివరాలు తమకు అందించాలని సూచించారు. గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ వివరించారు. సమావేశంలో ఎస్‌టి కమిషన్‌ డైరెక్టర్‌ జయంత్‌ జె.సరోడే, ప్రతినిధి బృందం రాధాకాంత త్రిపాఠి, గోవర్థన్‌ ముండే, పి. కె.పరీదా, దీనబంధు నాయక్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి, ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, ఆర్‌డిఒలు సిహెచ్‌.రంగయ్య, భరత్‌ నాయక్‌, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జయదేవి, డిఆర్‌డిఎ పీడీ డి.విద్యాసాగర్‌, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ తదితరులు పాల్గొన్నారు.తొలుత మెళియాపుట్టిలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పోలూరు వద్ద గ్రానైట్లతో పొల్యూషన్‌ బారిన పడుతున్నామని, గిరిజన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయని గిరిజన సంఘ నాయకులు వాబ యోగి తదితరులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, తహశీల్దార్‌ పి.సరోజని తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️