అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పూర్తయ్యేదెప్పుడో?

పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా భవనాలను

సూదికొండలో శ్లాబ్‌తో నిలిచిపోయిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌

సూదికొండలో శ్లాబ్‌స్థాయిలో నిలిచిన వైనం

గృహాల్లోనే నడుస్తున్న హెల్త్‌ సెంటర్లు

ప్రజాశక్తి- పలాసపట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా భవనాలను మంజూరు చేసింది. రెండేళ్లు కావస్తున్న భవన నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అద్దె నివాసగృహాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సూదికొండ ప్రాంతంలో హెల్త్‌ సెంటర్‌ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. మండలంలోని మొగిలిపాడు, సూదికొండ, జగనన్న కాలనీలో ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రెండేళ్లు క్రితం రూ.80 లక్షలు నిధులను మంజూరు చేశారు. ఒక వైపు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రారంభించి రోగులకు వైద్య సేవలు అందించాలని ఉన్నత అధికారులు చెబుతున్నారు. కానీ, మండలస్థాయి అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వహించడంతో నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రస్తుతం మొగిలిపాడు, రామకృష్ణాపురం జగనన్న లేఅవుట్‌లో పనులు చివరి దశకు చేరుకోగా, సూదికొండ ప్రాంతంలో శ్లాబ్‌ వేసి పనులు నిలిచిపోయాయి. నివాసాలే హెల్త్‌ సెంటర్లుపలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ పరిధిలో నర్సిపురం, శివాజీనగర్‌, హట్కో కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అవీ నివాస గృహాలు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న మందులు, సామగ్రి ఉంచేందుకు స్థలం సరిపోవడం లేదు. మరోవైపు రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేలకు వేలు భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నా పూర్తిస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నివాసగృహాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పెట్టడం ద్వారా మున్సిపాలిటీ ప్రజలకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయా? అనే విషయం కూడా తెలియని పరిస్థితి. ఏదేమైనప్పటికీ నివాసగృహాల్లో హెల్త్‌ అర్బ సెంటర్లో నిర్వహించడం ద్వారా రోగులకు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు పక్కా భవనాలు లేకపోవడం వల్లే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. త్వరతిగతిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో భవనాలను పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలతో పాటు వైద్య అధికారులు కోరుతున్నారు. ఈ విషయం పై మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ను వివరణ కోరగా, మొగిలిపాడు పూర్తయిందని, జగనన్న లేఅవుట్‌లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. సూదికొండలో శ్లాబ్‌ వేశామని అన్నారు. త్వరితగతిన హెల్త్‌ సెంటర్లు పూర్తి చేసి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు అప్పగిస్తామని తెలిపారు.

 

➡️