ఆశావర్కర్లుగా మార్పు చేయాలి

గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న

ఐటిడిఎ వద్ద ధర్నా చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు

  • టిడిఎ వద్ద కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల ధర్నా

ప్రజాశక్తి – సీతంపేట, శ్రీకాకుళం

గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న 2,361 మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశావర్కర్లుగా మార్పు చేయాలని, రూ.10 వేల వేతనం చెల్లించాలని సిఐటియు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, డి.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐటిడిఎల పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన సీతంపేట ఐటిడిఎ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు గౌరవ వేతనం రూ.నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేతనంతో వారి కుటుంబాన్ని ఏవిధంగా పోషించాలని ప్రశ్నించారు. యూనిఫాం, రికార్డ్స్‌ మెడికల్‌ కిట్స్‌, టిఎ, డిఎలు ఇవ్వడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేవలం రూ.నాలుగు వేలు వేతనం ఇస్తూ సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని, యూనిఫాం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.పది లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయపార్వతికి వినతిపత్రం అందించారు. ధర్నాలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.సురేష్‌, ఎం.కాంతారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు, ఎన్‌.అప్పన్న కె.భాస్కరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయుకులు ఎస్‌.మాలతి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయుకులు హైమావతి, ఎస్‌.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️