‘ఉపాధి’ని నీరుగారుస్తున్న కేంద్రం

వ్యవసాయ కూలీలంతా ఐక్యంగా పోరాడి సాధించుకున్న ఉపాది హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బిజెపి నీరుగార్చే విధానాలను

సదస్సులో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వ్యవసాయ కూలీలంతా ఐక్యంగా పోరాడి సాధించుకున్న ఉపాది హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బిజెపి నీరుగార్చే విధానాలను అమలు చేస్తోందని, ఈ చట్టాన్ని తిరిగి పరిరక్షించుకు నేందుకు ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సంఘం 17వ జిల్లా మహాసభ ఆదివారం నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతి రేక విధానాలు వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో కోత విధించి కూలీల పొట్టకొట్టిందని విమర్శించారు. సంస్కరణలతో ప్రజల ఉపాధికి గండి కొడుతున్నారన్నారు. ఈ చట్టాన్ని కాపాడుకునేందుకు పోరాటాలే శరణ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టంలో తీసుకొస్తున్న నూతన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 200 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు రూ.600 కూలి చెల్లించాలని అన్నారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిన తీరు దుర్మార్గమని అన్నారు. వామపక్ష పోరాటాల ఫలితంగా యుపిఎ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ చట్టం గొంతు నులమడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా క్షిణించిందని, దీని ఫలితంగా ఉపాధి హామీ పనులకు డిమాండ్‌ పెరుగుతోందని అన్నారు. సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి గంగరాపు సింహాచలం మాట్లాడుతూ సాంకేతికతను అడ్డం పెట్టుకుని పేదల జీవనోపాధిని దెబ్బతీసేందుకు కుట్ర చేశారన్నారు. ఉపాధి హామీని ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్దఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు కె.ఎల్లయ్య, జి.ఈశ్వరమ్మ, డి.భాస్కరరావు, పి.భవాని, భానుమతి పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికనగరంలోని జిల్లా యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 17వ జిల్లా మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా శిర్ల ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా గంగరాపు సింహాచలం తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వారితో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బి.కృష్ణమూర్తి, జిల్లా నాయకులు గంగరాపు ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

 

➡️