ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో

మాట్లాడుతున్న మహాలక్ష్మి

* మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి

ప్రజాశక్తి- నందిగాం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ పథకం సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. నందిగాం జిల్లా పరిషత్‌ ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23 ఏళ్లు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించకుండ, కనీస వేతనాలు అమలు చేయకుండా పని చేయించుకోవడం దుర్మార్గమని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల బతుకులు ఎటువంటి మార్పులు లేవన్నారు. మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. వంట చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదానికి గురైనా, మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.పది వేలు ఇవ్వాలన్నారు. ప్రతినెలా 5న నాటికి వేతనాలు, బిల్లులు చెల్లించాలన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్లు వర్తింపజేయాలన్నారు. ఏడాదికి రెండు జతలు యూనిఫారాలు అందజేయాలన్నారు. ఉచితంగా గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించే పద్ధతి ఆపాలన్నారు. మౌలిక సదుపాయాలైన తాగునీరు, వంట షెడ్‌, వంట పాత్రలు వంటి సమస్యలు పరిష్కరించాలన్నారు. చాలాసార్లు యూనియన్‌ ఆధ్వర్యాన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మండల నాయకులు వి.చిన్నమ్మడు, ఎ.పద్మావతి, కె.మహేశ్వరి, బి.బాలమ్మ, పి.బృందావతి, ఎం.పండా పాల్గొన్నారు.

➡️