ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమ్మె సమయంలో ఒప్పందంలో

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమ్మె సమయంలో ఒప్పందంలో అంగీకరించిన మేరకు జిఒలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, ఉపాధ్యక్షులు ఎ.గణేష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మె కాలపు ఒప్పంద జిఒలు జారీ చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా 16 రోజుల సమ్మె కాలపు ఒప్పందాల జిఒలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికుల స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాల సమస్యపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెల్లడించాలన్నారు. క్లాప్‌ డ్రైవర్ల సమస్యలపై నెలాఖరులోపు జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని అంగీకరించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఇప్పటివరకు మినిట్స్‌ కాపీతో పాటు సంక్రాంతి కానుక రూ.వెయ్యి, సమ్మె కాలపు జీతం చెల్లింపునకు సంబంధించిన జిఒలు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. అందులోనూ ఎన్‌ఎంఆర్‌, కోవిడ్‌, వరదలు, కొత్తగా తీసుకున్న కార్మికులు, క్లాప్‌ డ్రైవర్లకు సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని జిఒలో పేర్కొనకపోవడం వల్ల స్థానిక మున్సిపల్‌ అధికారులు వీరికి సమ్మె కాలం జీతాలు చెల్లించడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వర్కర్స్‌కు సంబంధించి రూ.21 వేలు, శానిటేషన్‌ డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ కార్మికులకు రూ.24,500, విలీన గ్రామ పంచాయతీ కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించి రూ.21 వేలు జీతం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.75 వేలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు, సాధారణ మృతికి రూ.రెండు లక్షలు, ప్రమాద మృతులకు రూ.ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ సిబ్బందికి సంబంధించి రూ.20 కోట్లకు పైగా బకాయి ఉన్న సరెండర్‌ లీవులు చెల్లింపులు, జిపిఎఫ్‌ అకౌంట్లు ప్రారంభం, క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వర్కర్లకు సంబంధించి సంక్షేమ పథకాల అమలు తదితర జిఒలను జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్‌.ప్రకాష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు సిహెచ్‌.మురుగన్‌, పి.బాలకృష్ణ, కె.వెంకటి, ఎ.శంకర్‌, ఎన్‌.పార్వతి, ఆరుద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

➡️