ఓటర్ల జాబితాలో లోపాలు

జిల్లాలో ఓటర్ల ముసాయిదా ప్రకటించిన తర్వాత సవరణల్లో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు ఫిర్యాదు

వినతిపత్రం అందజేస్తున్న రవికుమార్‌ తదితరులు

* కలెక్టర్‌కు టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో ఓటర్ల ముసాయిదా ప్రకటించిన తర్వాత సవరణల్లో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు గుండ లకీëదేవి, బగ్గు రమణమూర్తి ఇతర టిడిపి నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం నగరంలో మాజీ ఎమ్మెల్సీ మృతి చెందినా ఓటు హక్కు కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన నివాస్‌, ఆయన కుటుంబంలో నలుగురి ఓట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటివి పెద్దఎత్తున ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. ముసాయిదాలో ఉన్న పేర్లపై అభ్యంతరాలు తెలియజేసినా, ఇంతవరకు వాటిని సరిదిద్దలేదన్నారు. పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దకుండా ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని తెలిపారు. ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాల్లో ఒడిశాలో నివాసముంటున్న వారిని ఓటర్లుగా చేర్చారని, వాటిని తొలగించాలని ఫిర్యాదులు ఇచ్చినా ఇంతవరకూ సవరించలేదన్నారు. లోపాలను సరిదిద్ది వాస్తవ జాబితాను రూపొందించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, ఎం.వెంకటేష్‌, ఎస్‌.వి రమణ మాదిగ తదితరులున్నారు.

 

➡️