కనీస వేతనాలను అమలు చేయాలి

ఆచార్య ఎన్‌జి రంగా

మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి – ఆమదాలవలస

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎఆర్‌ఎఆర్‌ఎస్‌లు, కెవికెల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ కనీసవేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె.నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్మికులు సమ్మెలో భాగంగా ఏడో రోజు గురువారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులను అప్కాస్‌లో చేర్చాలన్నారు. కార్మికులు మరణిస్తే సహజ మరణానికి రూ.రెండు లక్షలు, ప్రమాద మరణానికి రూ.ఐదు లక్షల పరిహారం చెల్లించేందుకు జారీ చేసిన జిఒను కాంట్రాక్టు కార్మికులకూ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. పని ప్రదేశంలో కార్మికులు పాముకాటు, ఇతర ప్రమాదాలకు గురైనప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం, రీసెర్చ్‌ స్టేషన్‌ అధికారులు బాధ్యత తీసుకొని వైద్యం చేయించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ పరిధిలో ఖాళీ ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్మికుల వివరాలను రీసెర్చ్‌ స్టేషన్లలో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలని, కార్యాలయంలో స్వీపర్‌, అటెండర్‌ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్మిక శాఖ ఆదేశాల ప్రకారం జాతీయ పండుగ సెలవులను వర్తింపజేసి, రోజుకు రూ.650 దినసరి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షులు ఎన్‌.సీతామహాలక్ష్మి, కార్యదర్శి త్రివేణి, కె.కృష్ణవేణి, ఎ.యుగంధర్‌, గణపతి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️