జగన్‌పై నమ్మకం పోయింది

వైసిపిని స్థాపించినప్పట్నుంచీ ముఖ్యమంత్రి

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

  • అందుకే వైసిపిని వీడుతున్నారు
  • టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

వైసిపిని స్థాపించినప్పట్నుంచీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెనుక నడిచిన వారు, ఆయన జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న వారు ఇప్పుడు ఆయనపై నమ్మకం లేక ఆ పార్టీని వీడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సొంత తల్లి, చెల్లినే ఆదరించని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మండలంలోని చిన్నసాన వైసిపి ఎంపిటిసి నంబాళ్ల రాజశేఖర్‌, మాజీ సర్పంచ్‌ ఎండ నాగేశ్వరరావుతో పాటు చిన్నసాన, జీయన్నపేట పంచాయతీలకు చెందిన పలువురు బుధవారం టిడిపిలో చేరారు. వారికి అచ్చెన్నాయుడు కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు ఆయన రాజకీయాలకు పనికిరాడని గ్రహించి టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి దాపురించిందన్నారు. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో సహజ సంపదను దోచుకున్నారని తెలిపారు. వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. మరో మూడు నెలల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ ఇబ్బందులేవీ ఉండవన్నారు.టెక్కలి నియోజకవర్గంలో వైసిపికి నాయకత్వమే లేదని, ఇక్కడ ఉన్న నాయకునికి టిడిపి నాయకులకు తిట్టడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. టెక్కలి నియోజకవర్గం టిడిపిలోనే అభివృద్ధి చెందిందని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గాన్ని పారిశ్రామికవాడగా తయారు చేస్తానని హామీనిచ్చారు. కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీలో సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడ్డారని, టిడిపి వచ్చాక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తెస్తామన్నారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని నడపలేని, చేతకాని నాయకులు అధికారంలో ఉన్నారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్‌, బగాది శేషు, మాజీ ఎంపిపిలు టి.రామకృష్ణ, వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️