నెరవేరిన సొంతింటి కల

Mar 4,2024 22:07

ప్రజాశక్తి – ఆమదాలవలస : పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని గాజులకొల్లివలస, తిమ్మాపురం లబ్ధిదారులు మండలంలోని సైలాడ వద్ద జగనన్న కాలనీలో నిర్మించిన గృహాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ నియోజక వర్గంలో వివిధ లేఅవుట్లలో 8978 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిఒక్కరికీ ఇల్లు ఎంత అవసరమో గుర్తెరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు ఏర్పాటు చేసుకునేలా తోడ్పాటు అందించారని తెలిపారు. మరి కొన్నాళ్లకు జగనన్న లేఅవుట్లు పెద్ద గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. లే అవుట్లలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సైలాడ దాసు నాయుడు, మొండేటి కూర్మారావు, సంపదరావు రామారావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్‌ బొడ్డేపల్లి నిరంజన్‌ బాబు, మున్సిపల్‌ వైస్‌ ఫ్లోర్‌లీడర్‌ అల్లం శెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, మామిడి రమేష్‌ పాల్గొన్నారు.

➡️