పాత పెన్షన్‌ సాధన సభకు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ విధానం అమలు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ పథకం

షర్మిలకు ఆహ్వాన పత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ విధానం అమలు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ పథకం అమలు కోరుతూ ఈ నెల 28న రాజమండ్రిలో నిర్వహించనున్న యుటిఎఫ్‌ సభకు హాజరు కావాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన పిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిలను నగరంలోని సన్‌రైజ్‌ హోటల్‌లో, కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడులను మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీవన ప్రమాణాలు ఒకే విధంగా లేవని అన్నారు. ఉద్యోగుల్లో 50 శాతంగా ఉన్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సిపిఎస్‌కు ప్రత్యామ్నాయమని గ్యారెంటీడ్‌ పెన్షన్‌ పథకం సంతృప్తిని ఇవ్వలేదని అన్నారు. ఇందులో రూపొందించిన విధానం లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. 30 నుంచి 35 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగికి విశ్రాంత జీవన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కనపెట్టి సిపిఎస్‌ విధానం అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, జిల్లా కోశాధికారి బి.రవికుమార్‌, జిల్లా కార్యదర్శులు జి.నారాయణరావు, పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్‌, వై.వాసుదేవరావు, జిల్లా నాయకులు పి.సింహాచలం, బి.ఆనందరావు, టి.సుధీర్‌, పి.రమణికుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️